Upma : ఉప్మా అంటే 'నో' అంటున్నారా? పాలు పోసి చేస్తే డబుల్ రుచి!
ఈ వార్తాకథనం ఏంటి
సింపుల్‌గా తక్కువ సమయంలో తయారయ్యే టిఫిన్స్‌లో ఉప్మాకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా ఇళ్లలో వారానికి రెండు-మూడు సార్లైనా సేమియా ఉప్మా, రవ్వ ఉప్మా వంటివి చేస్తుంటారు. అయితే ఉప్మా అంటేనే ఇష్టం లేని వాళ్లు కూడా చాలామందే. ముఖ్యంగా పిల్లలైతే పేరు విన్న వెంటనే 'వద్దు' అని చెప్పేస్తారు. అలాంటి వారందరికీ ఈసారి ఎప్పటిలా కాకుండా, కొంచెం కొత్తగా ఈ విధానంలో ఉప్మా చేసి చూడండి. ఈ పద్ధతిలో చేసిన ఉప్మా తినడానికి ఇష్టపడనివాళ్లే ఆసక్తిగా తింటారు. మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు కూడా. ప్రత్యేకత ఏంటంటే... దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కేవలం 10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీగా తయారవుతుంది.
Details
కావాల్సిన పదార్థాలు
మరి ఆలస్యం ఎందుకు? నోరూరించే ఈ స్పెషల్ ఉప్మాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. బొంబాయి రవ్వ - పావు కిలో (250 గ్రాములు) జీలకర్ర - 1 టీ స్పూన్ ఉప్పు - రుచికి సరిపడా ఆయిల్ - పావు కప్పు ఆవాలు - 1 టీ స్పూన్ శనగపప్పు - 2 టీ స్పూన్లు మినపప్పు - 2 టీ స్పూన్లు జీడిపప్పు - 15 కరివేపాకు - కొద్దిగా పచ్చిమిర్చి - 3 అల్లం తరుగు - 1 టేబుల్ స్పూన్ నెయ్యి - పావు కప్పు పాలు - ఒక కప్పు
Details
తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో పావు కిలో బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్‌లో నెమ్మదిగా వేయించాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మంచి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి. రవ్వ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు కలిపాలి. అదే కడాయిలో పావు కప్పు ఆయిల్ వేసి వేడి చేయాలి.నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, రెండు టీ స్పూన్ల శనగపప్పు, రెండు టీ స్పూన్ల మినపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత 15 జీడిపప్పు పలుకులు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి.
Details
తయారీ విధానం 1/2
ఇప్పుడు ఇందులో మూడు కప్పుల నీళ్లు, ఒక కప్పు పాలు పోసి బాగా కలపాలి. మిశ్రమం మరిగి పొంగు రాగానే ముందుగా వేయించిన రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు పడకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. అనంతరం మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉప్మాను ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. చివరగా పావు కప్పు నెయ్యి వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. అంతే... ఘుమఘుమలాడే, సూపర్ టేస్టీ ఉప్మా రెడీ! ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలు, పెద్దలు అన్నీ మరిచి ఇష్టంగా తింటారు. అంతేకాదు, మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారన్నది ఖాయం.