Page Loader
Earth Day 2025: మన భూమి కాపాడితేనే మన భవిష్యత్ భద్రం.. వరల్డ్ ఎర్త్ డే విశేషాలు
మన భూమి కాపాడితేనే మన భవిష్యత్ భద్రం.. వరల్డ్ ఎర్త్ డే విశేషాలు

Earth Day 2025: మన భూమి కాపాడితేనే మన భవిష్యత్ భద్రం.. వరల్డ్ ఎర్త్ డే విశేషాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనిషి జీవనం పూర్తిగా భూమిపైనే ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం, త్రాగునీరు వంటి ప్రధాన అవసరాలన్నీ ఈ భూమే సమకూరుస్తుంది. అందువల్ల, భూమిని సంరక్షించడం ద్వారా మాత్రమే జీవరాశులన్నీ మనుగడ సాధించగలవు. ప్రజల్లో ఈ చింతన పెంపొందించేందుకు ప్రతీవ సంవత్సరం ఏప్రిల్ 22న వరల్డ్ ఎర్త్ డే జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా నిర్వహించే అంతర్జాతీయ కార్యక్రమంగా నిలిచింది. భూమి రక్షణపై గ్లోబల్ అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

వివరాలు 

వరల్డ్ ఎర్త్ డే 2025 - థీమ్ 

ప్రతి ఏడాది ఏప్రిల్ 22న జరుపుకునే భూమి దినోత్సవం ఈసారి (2025) ప్రత్యేకంగా "అవర్ పవర్, అవర్ ప్లానెట్" అనే థీమ్‌తో ముందుకు వచ్చింది. ఈ థీమ్ ద్వారా ప్లాస్టిక్ వల్ల పెరుగుతున్న పర్యావరణ నాశనంపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాస్టిక్ వినియోగం భూమికి తీవ్రమైన హానిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో EARTHDAY.ORG సంస్థ 2040 నాటికి ప్లాస్టిక్ ఉత్పత్తిని 60 శాతం వరకు తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇది అత్యవసరం.

వివరాలు 

ఎర్త్ డే చరిత్ర - 1970లో మొదలైన ఉద్యమం 

భూమి దినోత్సవాన్నిజరిపే ఆలోచన మొదటిసారిగా 1970లో వచ్చింది.అమెరికా సెనేటర్ గేలోర్డ్ నెల్సన్,హార్వర్డ్‌కి చెందిన విద్యార్థి డెనిస్ హేస్‌ ఈ ఆలోచన వెనుక ఉన్న ముఖ్య వ్యక్తులు. 1969లో కాలిఫోర్నియాలో శాంటాబార్బరా తీరంలో జరిగిన భారీ చమురు లీక్ ఘటన వారిలో తీవ్ర స్పందనను కలిగించింది. అప్పటివరకు ప్రజల్లో పర్యావరణ సమస్యలపై అవగాహన తక్కువగా ఉండేది. ఈనేపథ్యంలో, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు,సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు డెనిస్ హేస్‌ను ఉద్యమ నేతగా నియమించి,ఏప్రిల్ 22 తేదీని ఎర్త్ డేగా ప్రకటించారు. ఆ రోజు అమెరికా అంతటా 20మిలియన్ల మంది పౌరులు పాల్గొనడం ద్వారా ఈ ఉద్యమం పెద్ద దశకు చేరుకుంది. 1990 నాటికి ఎర్త్ డే జాతీయ హద్దులను దాటి అంతర్జాతీయ కార్యక్రమంగా మారింది.

వివరాలు 

ఎర్త్ డే సందర్భంగా మనం చేయవలసినవి 

భూమి దినోత్సవం రోజున మనందరి బాధ్యత భూమిని కాపాడటమే.అందుకే, మానవుడు తన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే తొలి అడుగు. ఇంట్లోనే మొదలుపెట్టి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి. కుటుంబ సభ్యులకు, పిల్లలకు పర్యావరణం మీద ప్రేమ కల్పించాలి. ప్లాస్టిక్ వినియోగం శక్తి వనరులను కూడా దుర్వినియోగం చేస్తోంది. దీన్ని తగ్గించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని కూడా నియంత్రించవచ్చు. భూమిపై మనతో పాటు జీవించే ఇతర జీవరాశులు, మొక్కలు, చెట్లు కూడా మన సంరక్షణకు అర్హులు. మన అజాగ్రత్త వల్ల సముద్రజీవులు ప్లాస్టిక్ తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇది మన చర్యల ఫలితం అన్న బాధ్యత మనదే కావాలి.

వివరాలు 

కొన్ని ఆసక్తికరమైన ఎర్త్ డే గణాంకాలు 

1970లో జరిగిన మొదటి ఎర్త్ డేలో సుమారు రెండు కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. 2010లో ప్రపంచవ్యాప్తంగా అటవీ నాశనాన్ని అడ్డుకునేందుకు 10 లక్షల చెట్లు నాటడం జరిగింది. ప్రతి సంవత్సరం దాదాపు 18 బిలియన్ ఎకరాల అడవులు నాశనం అవుతున్నాయని అంచనా.