దుబాయ్ వెళ్తున్నారా? ఈ అనుభవాలను ఖచ్చితంగా మిస్ అవకండి
దుబాయ్ ఇప్పుడు ప్రపంచ దేశంగా మారిపోయింది. ప్రపంచ దేశాలు రకరకాల ఈవెంట్స్ నిర్వహించడానికి దుబాయ్ ని వేదికగా చేసుకుంటున్నాయి. పర్యటకాన్ని ఆకర్షించడానికి దుబాయ్ ప్రభుత్వం సైతం ఎన్నో రకాల సౌకర్యాలను కల్పిస్తోంది. దుబాయ్ లో ఆకాశాన్ని తాకే ఎత్తయిన భవంతులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సముద్రతీరాలు, థీమ్ పార్కులు మొదలైనవి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం దుబాయ్ లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం. ఎడారిలో సఫారీ: దుబాయ్ వెళ్లిన వాళ్ళు ఈ సఫారీ అనుభవించాలి. 20నిమిషాల సఫారీ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సఫారీలో సూర్యాస్తమయ సమయంలో ఫోటోగ్రఫీ, బెల్లీ డాన్స్, ఇంకా ఇతర పర్ఫామెన్సులు ఉంటాయి. సాండ్ స్కైయింగ్, క్వాడ్ బైకింగ్ వంటి ఆకర్షణలు కూడా కనిపిస్తాయి.
స్కై డైవింగ్
మీకు సాహసాలు ఇష్టమైతే స్కై డైవింగ్ తప్పకుండా చేయండి. దుబాయ్ లోని పామ్ జుమేరియా నుండి స్కై డైవింగ్ చేయవచ్చు. 13వేల అడుగుల ఎత్తు నుండి స్కై డైవింగ్ చేసే అవకాశం ఇక్కడ ఉంది. బుర్జ్ ఖలీఫా: దుబాయ్ వెళ్లినవారు ఈ భవనాన్ని చూడకుండా వస్తే అది తప్పే అవుతుంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం ఇదే. ఆకాశాన్ని తాకుతుందేమో అన్నంత ఎత్తుగా ఈ భవనం ఉంటుంది. ఈ భవనంలో 125, 148 మధ్య అంతస్తుల నుండి దుబాయ్ నగరాన్ని చూడడం నిజంగా సరికొత్త అనుభూతిగా మిగిలిపోతుంది. సముద్రతీరాలు: దుబాయ్ లో సముద్ర తీరాల్లో రకరకాల గేమ్స్ ఆడుతుంటారు. స్నేహితులందరితో కలిసి బీచ్ వాలీబాల్ ఆడడం బాగుంటుంది.