సిటీకి కొత్తగా వెళ్లారా? ఇంటివైపు మనసు మళ్ళుతోందా? ఈ పనులు చేయండి
చదువు కోసమో, ఉద్యోగం కోసమో ఊరు వదిలి సిటీకి వెళ్ళడం సాధారణమే. ఐతే ఊరును విడిచి వచ్చిన కొత్తల్లో, సిటీలో ఉండాలనిపించదు. ఇంటిమీద బెంగగా ఉంటుంది. ఆ పరిస్థితిని దూరం చేయాలంటే కొన్ని పనులు చేయాలి. మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు: ఇంటి మీద బెంగగా ఉన్నప్పుడు, అలా ఉండకూడదని చెప్పి మనసును కష్టపెట్టుకోవద్దు. ఇంటి గురించి, ఊరు గురించి ఆలోచించడానికి కొంత టైమ్ ఇవ్వండి. ఆ తర్వాత వేరే పనుల్లో నిమగ్నం అయిపోండి. బిజీగా ఉంచుకోండి: ఖాళీగా ఉన్నప్పుడే ఇల్లు, ఊరు గుర్తొస్తాయి. అందుకే ఖాళీ లేకుండా పనిచేయండి. రూమ్ శుభ్రం చేయడం, డెకరేట్ చేయడం లాంటి పనులు పెట్టుకోండి. శని, ఆదివారాలు ఖాళీగా ఉండడం కంటే పార్ట్ టైమ్ జాబ్ చేయండి.
ఇంటి మీద బెంగను దూరం చేసే కొత్త ప్రదేశాలు, కొత్త పనులు
కొత్త ప్రదేశాల్లో తిరగండి. కిరాణా సామాను ఎక్కడ కొనుక్కోవాలో, బట్టలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాంతో మీకు ఆ ప్రాంతం మీద పట్టు రావడమే కాకుండా ఇంటి ఆలోచనలు మీ మనసులోకి రావు. మీ ఇంటివాళ్లతో లిమిట్ గా మాట్లాడండి. ఇంట్లో వాళ్ళు పదే పదే గుర్తొస్తుంటే వాళ్లతో ఫోన్ లో మాట్లాడండి. సుదీర్ఘ సంభాషణలు అవసరం లేదు. చాలా లిమిట్ గా మాట్లాడాలి. అలా మాట్లాడినపుడు మీ రూమ్ గురించి, మీ కొత్త జాబ్ గురించి, సిటీ ఎలా ఉందనే దాని గురించే వాళ్ళతో చెప్పండి. అంతే కానీ ఊర్లో మీకున్న గత కాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడొద్దు. దానివల్ల బెంగ తగ్గకపోగా మరింత పెరుగుతుంది.