పశ్చిమోత్థాసనం రోజూ ఎందుకు చేయాలి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి?
యోగాసనాలు చేసే అలవాటు మీకుంటే పశ్చిమోత్థాసనం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. శరీరాన్ని పూర్తిగా వంచే ఈ ఆసనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనం ఎలా చేయాలో ముందుగా తెలుసుకుందాం. యోగా మ్యాట్ మీద కాళ్ళను ముందుకు చాపి కూర్చోవాలి. ఇప్పుడు నడుమును వంచుతూ, మీ చేతులతో కాలిబొటన వేళ్ళను పట్టుకోవాలి. ఈ ప్రాసెస్ లో మోకాళ్ళను వంచకూడదు. ఒకవేళ బొటన వేళ్ళను పట్టుకోవడం అసాధ్యమైతే గనక చేతివేళ్ళతో కాలి మడమలను పట్టుకోవాలి. దీన్నే పశ్చిమోత్థాసనం అంటారు. ఈ ఆసనం గురించి 15వ శతాబ్దానికి చెందిన యోగా గ్రంధాల్లో ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమోత్థాసనం ఎందుకు వేయాలో తెలుసుకుందాం.
పశ్చిమోత్థాసనం ప్రయోజనాలు
ఈ ఆసనం చేయడం వల్ల భుజాలు, వెన్నెముక, తొడ కండరాల్లో ఉన్న నొప్పులు, ఒత్తిళ్ళు దూరమైపోతాయి. నాడీ మండల వ్యవస్థను ప్రశాంతంగా మార్చడంలో పశ్చిమోత్థాసనం పనిచేస్తుంది. నిద్ర సంబంధ సమస్యలను దూరం చేసి సుఖనిద్రను ఈ ఆసనం అందిస్తుంది. కండరాలకు విశ్రాంతిని అందించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగ్గా చేస్తుంది. ఇంకా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలోనూ, బరువు తగ్గించడంలోనూ ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనం ఎవరెవరు చేయకూడదంటే? ఇటీవల కడుపు సంబంధ సర్జరీలు అయినవారు, స్లిప్ డిస్క్ సమస్యతో బాధపడేవారు పశ్చిమోత్థాసనం చేయకూడదని గుర్తుంచుకోవాలి.