ఆరోగ్యం: ముక్కుదిబ్బడ వల్ల గాలి పీల్చుకోలేక పోతున్నారా? ఈ చిట్కాలు చూడండి
ముక్కు దిబ్బడ వల్ల శ్వాస తీసుకోవడం కూడా కొన్ని సార్లు కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిని ప్రతీ ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఉంటారు. ముక్కుదిబ్బడ వల్ల ముక్కు గట్టిగా మారుతుంది. ముక్కు లోపల రక్తనాళాలు ఉబ్బడం వల్ల గాలి లోపలకు వెళ్ళకుండా ముక్కు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిని ప్రకృతి వైద్యంతో ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ సి వల్ల జలుబు తగ్గుతుందని తెలిసింది. అందువల్ల "విటమిన్ సి" అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి. అల్లం టీ తాగండి. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు జలుబు మీద బాగా పనిచేస్తాయి. వేడినీళ్ళతో స్నానం చేయండి: దీనివల్ల మీ ముక్కులోని శ్లేష్మం పలుచగా మారుతుంది. ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది.
ముక్కుదిబ్బడ తగ్గించే మరికొన్ని చిట్కాలు
స్నానం చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే, వేడినీళ్ళు వచ్చే ట్యాప్ ముందు మీ తలను ఉంచండి. తలమీద టవల్ చుట్టుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవిరి పట్టుకోవడం: ఇది అందరికీ తెలిసినది. అత్యుత్తమమైనది కూడా. ఒక పాత్రలో నీళ్ళను బాగా మరిగించండి. బాగా మరిగిన తర్వాత పక్కకు తీసుకుని మీ తలను టవల్ తో కప్పుకుని ఆవిరి పీల్చుకోండి. ఇది బాగా పనిచేస్తుంది. కావాల్సినన్ని నీళ్ళు తాగండి: జలుబు తాలూకు లక్ష్ణాలు మీలోకి చేరినపుడు కావాల్సినన్ని నీళ్ళు తాగుతూ ఉండడం చాలా ఉత్తమం. ముఖ్యంగా గోరువెచ్చని నీరు తాగాలి. శరీరంలో నీటి శాతం పెరిగితే ముక్కులోని శ్లేష్మం పలుచబడుతుంది. దానివల్ల ముక్కుదిబ్బడ తగ్గుతుంది.