Oats: ఓట్స్ ఎలా తయారు చేస్తారు?.. వాటిలో రకాలు..వాటి పేర్లకున్న అర్థాలు
ఓట్స్ ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం లాగా ప్రాచుర్యం పొందింది. కానీ ప్రారంభంలో, దాన్ని ఒక కలుపు మొక్క అని భావించేవారు. గోధుమలు, బార్లీ వంటి పంటల మధ్య ఈ మొక్కలు పెరగడంతో వాటిని కలుపు అనుకుని పీకి పారేసేవారు. అంతేకాకుండా, అవి పశువులకు మేతగా ఉపయోగించేవారు. కానీ ఓట్స్‌లో ఉన్న పోషక విలువలను తెలుసుకున్న తరువాత, అవి మన ఆహారంలో స్థానం సంపాదించాయి.
ఓట్స్ ఎలా తయారు చేస్తారు?
ఓట్స్ చూడగానే, అవి ఒక రకమైన ఫ్యాక్టరీ ఉత్పత్తి అనిపించవచ్చు. కానీ నిజానికి, గోధుమలు, బియ్యం వంటి పంటల మాదిరిగా అవి కూడా పండుతాయి. ఈ గింజలు చూడ్డానికి పెద్దవిగా, కొద్దిగా పొడవుగా ఉంటాయి. వరి పంటలాగే వాటిని కోస్తారు. కొన్ని ప్రాంతాల్లో, అవి కాస్త వేరే రంగులో ఉండవచ్చు. బియ్యానికి బ్రౌన్ రైస్, వైట్ రైస్, పాలిష్డ్ రైస్ లాంటి రకాలు ఉన్నట్లే, ఓట్స్‌లో కూడా వోల్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, ఇన్స్టంట్ ఓట్స్ వంటి అనేక రకాలు ఉంటాయి. ప్రతి రకానికి వేరు వేరు ఉపయోగాలు, రుచులు ఉంటాయి.
ఓట్స్ రకాలు.. అర్థాలు
వోల్ ఓట్స్: ఇవి ఎలాంటి ప్రాసెసింగ్ జరగని,సహజస్థితిలో ఉన్న ఓట్స్.అవి బ్రౌన్ రైస్ లాంటి గింజలుగా ఉంటాయి. వీటిని ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది మరియు నీళ్లు కూడా ఎక్కువగా అవసరం అవుతుంది. స్టీల్ కట్ ఓట్స్:వోల్ ఓట్స్‌కు కొద్దిగా ప్రాసెసింగ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేస్తారు.వీటిని వండడానికి తక్కువ సమయం పడుతుంది.రాత్రంతా నానబెట్టి 'ఓవర్ నైట్ ఓట్స్' చేయవచ్చు. రోల్డ్ ఓట్స్:ఇవి అటుకుల్లాగా ఉండే ఓట్స్.ఓట్స్ గింజలను పెద్ద రోలింగ్ పిన్‌తో ఫ్లాట్‌గా చేస్తారు. వీటిని ఉడికించడానికి సుమారు 10 నిమిషాలు పడుతుంది. ఇన్స్టంట్ ఓట్స్:ఈ రకం ఓట్స్ చిన్న ముక్కలుగా ఉంటాయి,అందువల్ల వీటిని 2 నిమిషాల్లో ఉడికించవచ్చు.మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ మసాలా ఓట్స్ వీటిని ఉపయోగించి తయారు చేస్తారు.