Loading...
Ugadi 2026: ఉగాది పచ్చడి ప్రత్యేకత.. తయారీ విధానం
Ugadi 2026: ఉగాది పచ్చడి ప్రత్యేకత.. తయారీ విధానం

Ugadi 2026: ఉగాది పచ్చడి ప్రత్యేకత.. తయారీ విధానం

వ్రాసిన వారు Moogati Shabari
Mar 13, 2026
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సంవత్సరాది చైత్ర శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతుంది. ఈ పండుగను ఉగాదిగా జరుపుకుంటారు. తెలుగువారితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వేర్వేరు పేర్లతో ఈ పండుగను నిర్వహిస్తారు. ఉగాది రోజున తయారుచేసే పచ్చడికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచుల సమ్మేళనంగా ఈ పచ్చడి ఉంటుంది. మామిడి, చింతపండు, వేప పువ్వు, బెల్లం వంటి పదార్థాలతో దీనిని తయారుచేస్తారు. అవసరమైతే కొన్ని పండ్లను కూడా కలుపుతారు. ఉగాది పచ్చడిలో ఉండే ఈ ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను సూచిస్తాయని భావిస్తారు.

వివరాలు

ఉగాది పచ్చడికి అవసరమయ్యే పదార్థాలు

మామిడికాయ - 1

వేప పువ్వు - అర కప్పు

సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు - అర కప్పు

కొత్త చింతపండు - 100 గ్రాములు

కొత్త బెల్లం - 100 గ్రాములు

మిరపకాయలు - 2

అరటిపండు - 1

చెరకు రసం - అర కప్పు

ఉప్పు - తగినంత

నీరు - అవసరమైనంత

అవసరమైతే అరటిపండ్లు, జామకాయలు కూడా చేర్చుకోవచ్చు.

వివరాలు

తయారీ విధానం

ముందుగా వేప పువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి.

చింతపండును కొద్దిగా నీటిలో నానబెట్టి పది నిమిషాల తర్వాత గుజ్జును తీసుకోవాలి.

మామిడికాయ, మిరపకాయలు, కొబ్బరి ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.

చెరకు రసం సిద్ధం చేసుకుని ఇతర పండ్లను కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టాలి.

బెల్లాన్ని తురిమి చింతపండు గుజ్జులో కలపాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమంలో మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు, మిరపకాయ ముక్కలను వేసి చివరగా కొద్దిగా ఉప్పు చేర్చి బాగా కలపాలి.

ఇలా చేస్తే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమవుతుంది.

అనంతరం దేవతకు నైవేద్యంగా సమర్పించి తర్వాత కుటుంబ సభ్యులు స్వీకరిస్తారు.

జీవితంలో సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది.

ADVERTISEMENT