భారతదేశ ఆహార సాంప్రదాయాల్లో కనిపించే పద్ధతులు.. వాటి వెనక నిజాలు
ఆహార సాంప్రదాయాలు ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటాయి. ఆయా ప్రాంతాన్ని బట్టి ఆహార సాంప్రదాయాలు పుట్టుకొస్తాయి. భారతదేశంలో రకరకాల ఆహార సాంప్రదాయాలు కనిపిస్తాయి. ప్లేట్లో పెట్టుకున్న అన్నం పూర్తిగా తినడం దగ్గర నుండి భోజనం చేసేటప్పుడు ఎడమ చేయి వాడకూడదనే విషయం వరకు చాలా రకాల సంప్రదాయాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఆ సాంప్రదాయాలు ఏంటో తెలుసుకుని వాటి వెనుక ఉన్న నిజాలను అర్థం చేసుకుందాం.
చేతులతో తినడం
పశ్చిమ దేశాల్లో ఆహారాన్ని చేతులతో తినకుండా చెంచాలు వాడుతుంటారు. మనదేశంలో చేతులతో తినడం సాంప్రదాయంగా ఉంది. చేతులతో తినడం వల్ల ఆహారం రుచి మెదడుకు సులభంగా అర్థమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం డైరెక్ట్ గా చేతులతో ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణరసాలు ఊరుతాయని ఉంది. ప్లేట్లో పెట్టింది మొత్తం తినడం: భారతదేశ ఆహార సాంప్రదాయాల ప్రకారం ప్లేట్లో పెట్టిన మొత్తం భోజనాన్ని పూర్తి చేయాలి. ఒకవేళ మిగిలిస్తే భోజనానికి మర్యాద ఇవ్వనట్టు అవుతుంది. అన్నం వృధా చేయకూడదనే అలవాటు భారతీయుల్లో నాటుకుపోవడం వల్ల ఇది సాంప్రదాయంగా మారింది.
తినే సమయంలో ఎడమ చేతిని వాడకూడదు
ఆహారం తినే సమయంలో కేవలం కుడిచేత్తోనే తినాలి. ఎడమ చేతిని వాడకూడదు. దీనికి కారణం ఏంటంటే, ఎడమ చేతితో అనేక రకాల శుభ్రతా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆ చేయిని తినేటప్పుడు వాడకూడదని చెబుతారు. ఆహారాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టడం: భోజనం చేసే ముందు దేవుడికి నైవేద్యంగా ఆహారాన్ని పెట్టడం భారతీయులకు అలవాటు. ఇలా చేయడం వల్ల ఎంత చెడు ఉన్న అది తొలగిపోతుందని హిందువులు నమ్ముతారు. మరో విషయం ఏంటంటే, దేవుడికి ఆహారాన్ని నైవేద్యంగా పెట్టడం అనేది త్యాగం కిందకు వస్తుంది. తమకున్నదాంట్లోంచి కొద్దిగా అవతలివారికి ఇవ్వాలన్న కాన్సెప్ట్ ఇందులో కనిపిస్తుంది.