Ragi vaḍalu: ఇన్‌స్టంట్ రాగి వడలు.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది!
ఈ వార్తాకథనం ఏంటి
టిఫిన్స్‌లో వేడివేడిగా కరకరలాడే వడలు అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ వడలను కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీతో తింటే రుచి మరింత పెరుగుతుంది. అయితే సాధారణంగా వడలు తయారు చేయాలంటే ముందురోజే మినపప్పు నానబెట్టి, రుబ్బి, పులియబెట్టాల్సి ఉంటుంది. కానీ అలాంటి కష్టమే లేకుండా ఇన్‌స్టంట్‌గా రాగి వడలను తయారు చేసుకోవచ్చు. ఈ సులభమైన విధానాన్ని అనుసరిస్తే కొత్తగా చేసే వారు కూడా అద్భుతంగా వడలు చేసుకోవచ్చు.
వివరాలు
కావాల్సిన పదార్థాలు
రాగిపిండి - 3 కప్పులు బొంబాయి రవ్వ - 2 కప్పులు ఉల్లిపాయలు - 2 పెరుగు - 3 కప్పులు పచ్చిమిర్చి - 6 కరివేపాకు - కొద్దిగా కొత్తిమీర - కొంచెం నూనె - తగినంత
వివరాలు
తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్‌లో బొంబాయి రవ్వ వేసి మెత్తగా పొడి చేయాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల వడలు మెత్తగా, మంచి టెక్స్చర్‌తో వస్తాయి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో రాగిపిండి, గ్రైండ్ చేసిన బొంబాయి రవ్వ, తగినంత ఉప్పు వేసి కలపాలి. అందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు వేసి బాగా కలపాలి. అవసరమైనంత నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ పిండిని కలపాలి. పిండి మరీ పలుచగా కాకుండా, కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఆతర్వాత మూతపెట్టి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. తరువాత చేతిని తడిపి పిండిని కొద్దిగా తీసుకుని వడల ఆకారంలో చేసి ప్లేట్‌లో పెట్టుకోవాలి.
వివరాలు
తయారీ విధానం1/2
ఈ సమయంలో స్టవ్‌పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వడలను జాగ్రత్తగా కడాయిలో వేయాలి. మొదట ఒక నిమిషం అలాగే వదిలి, ఆపై మధ్యస్థ మంటపై చిల్లుల గరిటతో తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వడలు కరకరలాడేలా వేయించిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుంటే రెడీ! ఈ రుచికరమైన రాగి వడలను మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటాయి. ఈ వడలను బ్రేక్‌ఫాస్ట్‌గా మాత్రమే కాకుండా సాయంత్రం స్నాక్స్‌గా కూడా ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా పప్పు రుబ్బడం, పులియబెట్టడం వంటి ప్రక్రియలేమీ లేకుండా వెంటనే చేసుకోవచ్చనే సౌలభ్యం ఈ రెసిపీ ప్రత్యేకత.