ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే: ఆల్బినోలపై జనాలు నమ్మే అనేక మూఢనమ్మకాలు
ప్రతీ సంవత్సరం జూన్ 13వ తేదీన అంతర్జాతీయ ఆల్బినిజం అవేర్నెస్ రోజును జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం నిర్ణయించింది. ఆల్బినోలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి, ఆల్బినోలపై జనాల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి అంతర్జాతీయ ఆల్బినిజం అవేర్నెస్ రోజును జరుపుతున్నారు. ఆల్బినిజం అంటే: చర్మం, జుట్టు, కళ్ళు.. మొదలైన భాగాల్లో మెలనిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల పూర్తిగా తెల్లగా మారిపోతారు. అలా మారిన వారిని ఆల్బినోలు అంటారు. జన్యుపరమైన సమస్యల కారణంగా ఇలాంటి సమస్య వస్తుంది. ఆల్బినోలకు చర్మ క్యాన్సర్ లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్బినిజం అంటే అంటుకునే వ్యాధి కాదు. ఆఫ్రికా దేశాల్లో ఆల్బినోలపై అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి.
ఆల్బినోలపై మూఢనమ్మకాలు
ఆఫ్రికా వంటి దేశాల్లో ఆల్బినోలు ఎక్కువగా హత్యకు గురవుతున్నారు. టాంజానియాలో ఆల్బినోలు ఎక్కువగా ఉంటారు. అక్కడి సాధారణ జనాల్లో ఉన్న మూఢనమ్మకాల వల్ల ఎంతోమంచి ఆల్బినోలు హత్యకు గురయ్యారు. ఆల్బినోల శరీర భాగాలు అదృష్టాన్ని తీసుకువస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. అలాగే కొంతమంది మాత్రం, ఆల్బొనోలు ఆత్మలని, దయ్యాలని నమ్ముతుంటారు. ఇలాంటి మూఢనమ్మకాలను తొలగించి ఆల్బినోలకు రక్షణ కల్పించడానికి టాంజానియా ఆల్బొనో సొసైటీ ఇంకా ఇతర స్వఛ్ఛంద సంస్థలు కలిసి మే 4వ తేదీన జాతీయ ఆల్బినో దినోత్సవంగా ప్రకటించారు. ఆ తర్వాత అనేక సమావేశాలు, చర్చల తర్వాత జూన్ 13వ తేదీని అంతర్జాతీయ ఆల్బినిజం అవేర్నెస్ రోజుగా 2014లో ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది.