అంతర్జాతీయ మాదకద్రవ్యాలు దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతి ఏడాది జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుతున్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల మనుషులు, కుటుంబాలు, సమాజం పడుతున్న ఇబ్బందులపై అందరికీ అవగాహన కలిగించేందుకు ఈరోజును జరుపుతారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఒక రోజును జరపాలని ఐక్యరాజ్యసమితి 1987లో జనరల్ అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మొదటిసారిగా 1988 జూన్ 26వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించింది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు, వాటికి బానిసలుగా మారిపోవడం.. అలాగే అక్రమంగా రవాణా చేయడం వల్ల వచ్చే చట్టపరమైన రిస్కుల గురించి అవగాహన కలిగించేందుకు ఈ రోజున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈరోజున దృష్టి పెట్టాల్సిన విషయాలు
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ నిర్ణయించింది. ఆ విషయాలు ఏంటంటే ఎవరైతే మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తున్నారో వాళ్లకు దానివల్ల కలిగే ఇబ్బందులను తెలియజేయాలి. మాదకద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడానికి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్లు, సపోర్టు గురించి బాధితులకు తెలియజేయాలి. యువతకు మాదకద్రవ్యాల వాడకం మంచిది కాదని, అనేక వ్యసనాలకు దారితీస్తుందని తెలియజేయాలి. మాదకద్రవ్యాలు వాడుతున్న వారిని అనవసరంగా దూషించడం లాంటివి చేయకుండా వారిపై వివక్ష చూపించకుండా ఉండాలి.