LOADING...
May 1st Labor Day: మే 1 కార్మిక దినోత్సవం వెనుక అసలు కథ ఇదే.. ఎందుకు ప్రారంభమైంది తెలుసా?
మే 1 కార్మిక దినోత్సవం వెనుక అసలు కథ ఇదే.. ఎందుకు ప్రారంభమైంది తెలుసా?

May 1st Labor Day: మే 1 కార్మిక దినోత్సవం వెనుక అసలు కథ ఇదే.. ఎందుకు ప్రారంభమైంది తెలుసా?

వ్రాసిన వారు Moogati Shabari
May 01, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ప్రతి ఏడాది మే 1న జరుపుకుంటారు. కార్మికులు, కర్షకులు లేని ప్రపంచాన్ని ఊహించలేం. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్ర కీలకం. ఉత్పత్తి రంగంలో పనిచేస్తూ దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవి. అందుకే వారి పోరాటాలకు గౌరవం తెలుపుతూ, హక్కులను కాపాడాలని గుర్తుచేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును "మే డే"గా నిర్వహిస్తారు. కార్మికుల సహకారాన్ని గుర్తించడమే కాకుండా, శ్రామిక వర్గం ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకునే రోజు కూడా ఇదే.

వివరాలు

మే డే వెనుక ఉన్న చరిత్ర ఇదే..

ఈ దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర 19వ శతాబ్దానికి వెళ్తుంది. అప్పట్లో అమెరికా, యూరప్ దేశాల్లోని కర్మాగారాల్లో కార్మికులను రోజుకు 15 నుంచి 16 గంటలు పని చేయించేవారు. కానీ వారికి ఇచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. ఎలాంటి హక్కులు లేకుండా, సెలవులు లేకుండా పని చేయాల్సి రావడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో వేలాది కార్మికులు 8 గంటల పనిసమయం కోసం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మొదట ఈ నిరసనలు శాంతియుతంగా సాగాయి. కానీ ఆందోళనలను అణిచివేయడానికి పోలీసులు కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరెందరో గాయపడ్డారు.

వివరాలు

కార్మికుల త్యాగాలను గుర్తిస్తూ మే డే..

ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అనంతరం 1889లో పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో కార్మికుల త్యాగాలను గుర్తిస్తూ మే 1ను "అంతర్జాతీయ కార్మిక దినోత్సవం"గా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో కార్మిక దినోత్సవ వేడుకలు 1923 మే 1న చెన్నైలో మొదలయ్యాయి. ఆ రోజు మద్రాస్ హైకోర్టు ఎదుట కార్మికుల సమావేశం నిర్వహించి, వారి హక్కుల కోసం గళం వినిపించారు.

Advertisement

వివరాలు

కార్మికుల సేవలను గౌరవించే రోజు..

అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ రోజును కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కార్మిక దినోత్సవం కేవలం సెలవుదినం మాత్రమే కాదు. ఇది కార్మికుల సేవలను గౌరవించే రోజు. నేటికీ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సరైన వేతనాలు, భద్రతతో కూడిన పని వాతావరణం, సామాజిక న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మే డే ప్రాధాన్యం మరింత పెరిగిందనే చెప్పాలి.

Advertisement