ఇంటర్నేషనల్ మ్యూజియం డే: దేశ సంస్కృతిని, చరిత్రను తరువాతి తరాలకు అందించే మ్యూజియంలపై ప్రత్యేక కథనం
ప్రతీ ఏడాది మే 18వ తేదీన ఇంటర్నేషన్ మ్యూజియం డేని జరుపుతారు. మ్యూజియం ఎందుకు ఉండాలి? వాటివల్ల కలిగే లాభాలేంటి? వారసత్వ సంపదలకు రక్షణ ఎలా కలుగుతుంది మొదలగు విషయాలపై అందరికీ అవగాహన కల్పించడానికి మ్యూజియం డే జరుపుతారు. సాధారణంగా ఈ రోజున మ్యూజియం నిర్వాహకులు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఉపన్యాసాలు, వర్క్ షాప్స్, ఎగ్జిబిషన్స్.. మొదలగు వాటిని నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలకు అన్ని రకాల వయసుల వారిని ఆహ్వానిస్తుంటారు. చరిత్ర: 1977లో మే 18వ తేదీన మొదటిసారిగా ఇంటర్నేషనల్ మ్యూజియం డే మొదలైంది. రష్యాలో జరిగిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం సమావేశంలో ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది.
మ్యూజియం డే థీమ్
విభిన్న సంస్కృతుల పరిచయం, ఆల్రెడీ ఆచరణలో ఉన్న సంస్కృతులను కాపాడుకోవడం, విద్య, భవిష్యత్తులో అభివృద్ధికి తోడ్పడే వారసత్వ సంపదను కాపాడుకునేందుకు మ్యూజియం డే జరపాలని రష్యా సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా మ్యూజియంలు, మ్యూజియం డేను జరుపుకుంటాయి. ప్రతీ మ్యూజియం డే రోజున ఏదో ఒక థీమ్ ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి, మ్యూజియంల సుస్థిరత - శ్రేయస్సు అనే థీమ్ ని ఎంచుకున్నారు. మ్యూజియంలు ఎక్కువ కాలం మనుగడలో ఉండటానికి చేయాల్సిన పనులు మ్యూజియంలకు జనాకర్షణ పెరగడానికి, మన పురాతన కాలం నాటి వస్తువులను సేకరించడం, భద్రపర్చడం, ప్రదర్శించడం చేస్తూ ఉండాలి. ఈ పనులు సక్రమంగా జరిగినపుడే మ్యూజియంలకు సుస్థిరత లభిస్తుంది.