LOADING...
Holi 2026: హోలికా దహనంలో ఈ కలప వాడితే అశుభమా..? శాస్త్రాలు ఏమంటున్నాయంటే!
హోలికా దహనంలో ఈ కలప వాడితే అశుభమా..? శాస్త్రాలు ఏమంటున్నాయంటే!

Holi 2026: హోలికా దహనంలో ఈ కలప వాడితే అశుభమా..? శాస్త్రాలు ఏమంటున్నాయంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

హోలికా దహనం రోజున వెలిగించే అగ్ని మనిషిలోని కోపం, అసూయ, అహంకారం వంటి నెగటివ్ భావాలను దహనం చేస్తుందనే విశ్వాసం ఉంది. అందుకే ఈ ఆచారానికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం కల్పించారు. అయితే హోలికా దహనం సందర్భంగా ఎలాంటి కలపను ఉపయోగించాలి? ఏవి వినియోగించకూడదు? అనే విషయాలు శాస్త్రాల్లో స్పష్టంగా పేర్కొన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 4న దేశవ్యాప్తంగా జరగనుంది. దానికి ముందు రోజు, అంటే మార్చి 3 మంగళవారం రాత్రి ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా హోలికా దహనం నిర్వహించనున్నారు.

Details

కొన్ని నియమాలను పాటించాలి

ఈ పవిత్ర కార్యక్రమంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. శాస్త్రాల ప్రకారం హోలికా దహనంలో నేలపై సహజంగా రాలిన, పూర్తిగా ఎండిపోయిన కలపనే ఉపయోగించాలి. సజీవంగా ఉన్న చెట్లను నరికి తెచ్చిన కలపను వినియోగించడం శాస్త్రవిరుద్ధం. ముఖ్యంగా హిందువులు పవిత్రంగా భావించే రావి చెట్టును కాల్చడం అశుభప్రదమని చెబుతారు. అలాగే పూజలలో ఉపయోగించే జమ్మి చెట్టు, శుభకార్యాల్లో తోరణాలుగా కట్టే మామిడి ఆకులు, ఔషధ గుణాలు కలిగిన ఉసిరి చెట్టు, దైవస్వరూపంగా భావించే వేప చెట్టు, పూజల్లో వినియోగించే అరటి చెట్లు - ఇవన్నీ హోలికా దహనానికి పనికిరావు. బిల్వ పత్రాలు, బిల్వ చెట్టు కొమ్మలను కూడా కాల్చరాదని పెద్దలు సూచిస్తున్నారు.

Details

పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలనే ఉపయోగించడం మంచిది

పూజా కార్యక్రమాల్లో వినియోగించే పవిత్ర వృక్షాల కలపను దహనం చేయడం తగదని స్పష్టం చేస్తున్నారు. అయితే నేలపై పడిపోయి సహజంగా ఎండిపోయిన చెట్ల కట్టెలు, ఎండిన ఆకులు, వరి పొట్టు, గోధుమ పొట్టు, ఎండిన కొబ్బరి ఆకులు, వాటి మట్టలు వంటి వాటిని వినియోగించవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలనే ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. ఇక గోమయంతో తయారు చేసిన పిడకలను వినియోగించడం శుభప్రదమని, మంచి ఫలితాలు ఇస్తుందని పెద్దలు విశ్వసిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే, హోలికా దహనం ఆచారాన్ని ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణ దృష్టితో కూడా నిర్వహించాలనే సందేశం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement