త్రిపురలో జరిగే 14దేవతల పండగ కర్చీపూజ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఖర్చీపూజ పండగను పెద్ద ఎత్తున జరుపుతారు. దీన్ని 14దేవతల పండగ అని కూడా పిలుస్తారు. త్రిపురలోని అగర్తల నగరంలో చతుర్దాస్ దేవత గుడి దగ్గర ఈ పండగ జరుగుతుంది. ఈ గుడిలో 14దేవతల విగ్రహాలు ఉంటాయి. అసలు ఈ పండగ చరిత్ర ఏంటంటే: ఖర్చీ పదాన్ని త్రిపుర భాషల్లో రెండు పదాలుగా విడగొడతారు. ఖర్ అంటే పాపం అని అర్థం, చీ అంటే తొలగిపోవడం, శుభ్రత అని అర్థం. కర్చీ అంటే పాపం తొలగిపోవడం అన్నమాట. ఈ పూజను 15రోజుల అంబు బాచీ తర్వాత నిర్వహిస్తారు. చరిత్ర ప్రకారం ఇది మాతృదేవత రుతుక్రమాన్ని సూచిస్తుంది.
పండగ చరిత్ర, జరిగే విధానం
త్రిపురలో రుతుక్రమాన్ని అపవిత్ర సంఘటనలాగా చూస్తారు. అంబు బాచి సమయంలో భూమి అపవిత్రం అవుతుందని వాళ్ళు నమ్ముతారు. రుతుక్రమం తర్వాత అపరిశుభ్రతలను శుభ్రం చేయడం కోసం 7రోజుల పాటు పండగ జరుగుతుంది. ప్రతీ ఏడాది ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత ఎనిమిదవ రోజున ఖర్చీపూజ మొదలవుతుంది. అంటే ఈరోజు అగర్తలలో ఖర్చీపూజ మొదలయ్యింది. ఈ రోజున 14దేవతలను సైద్రా నదికి తీసుకెళతారు. అక్కడ పూజారులు స్నానం చేసి తిరిగి దేవతలను గుడికి తీసుకువస్తారు. నది నుండి తీసుకొచ్చేటపుడు దేవతలను పువ్వులతో అలంకరిస్తారు. ఈ పండగను చూడటానికి పక్క రాష్ట్రాల నుండి ప్రజలు వస్తారు. స్థానిక కళాకారులు జానపద నృత్యాలతో కనువిందు చేస్తారు.