LinkedIn: లింక్డిన్‌లో ఫేక్ ఉద్యోగ క్లెయిమ్స్‌కు చెక్.. కొత్త వెరిఫికేషన్ ఫీచర్లు
ఈ వార్తాకథనం ఏంటి
లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో తాము పనిచేయని కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పేర్కొంటున్న వారికి ఇకపై ఇబ్బందులు తప్పకపోవచ్చు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డిన్ కొత్త వెరిఫికేషన్ ఫీచర్లను తీసుకొస్తోంది. నకిలీ గుర్తింపులు, తప్పుడు ఉద్యోగ వివరాలు, కంపెనీల పేర్లతో జరిగే మోసాలను తగ్గించడమే వీటి ప్రధాన ఉద్దేశం.
వివరాలు
కంపెనీలకు ప్రత్యేక అధికారం
కొత్త ఫీచర్లలో భాగంగా వెరిఫైడ్ కంపెనీలకు కీలకమైన నియంత్రణను లింక్డిన్ ఇవ్వనుంది.
తమ సంస్థలో పనిచేస్తున్నట్లు తప్పుడు వివరాలు ఇస్తున్న అకౌంట్లను కంపెనీలు తొలగించేందుకు అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా అలాంటి ప్రొఫైల్స్ తమ సంస్థకు సంబంధించిన సెర్చ్ ఫలితాల్లో కనిపించకుండా, ఉద్యోగుల జాబితాలో చేరకుండా కూడా నిరోధించవచ్చు.
ఈ సదుపాయాన్ని రాబోయే కొన్ని వారాల్లో ప్రపంచవ్యాప్తంగా వెరిఫైడ్ కంపెనీలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు లింక్డిన్ వెల్లడించింది.
వివరాలు
ఉద్యోగ అనుభవానికీ ధ్రువీకరణ
ప్రొఫైల్‌లో పేర్కొన్న ఉద్యోగ అనుభవం నిజమో కాదో నిర్ధారించేందుకు మరో విధానాన్ని కూడా లింక్డిన్ పరీక్షిస్తోంది.
గతంలో కలిసి పనిచేసినవారు లేదా కలిసి చదువుకున్నవారు తమకు తెలిసిన వ్యక్తి ప్రొఫైల్‌లో పేర్కొన్న అనుభవాన్ని ధ్రువీకరించే అవకాశం ఉంటుంది.
అయితే ఈ ధ్రువీకరణ చేయాలంటే సంబంధిత వ్యక్తికి ఇప్పటికే వెరిఫైడ్ ప్రొఫైల్ ఉండాలి.
సాధారణంగా ఇచ్చే స్కిల్ ఎండార్స్‌మెంట్ కంటే ఈ విధానం భిన్నంగా ఉంటుందని లింక్డిన్ చెబుతోంది.
వివరాలు
ఆఫీస్ ఈమెయిల్‌తో వెరిఫికేషన్
కొన్ని సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం మరో వెరిఫికేషన్ విధానాన్ని కూడా లింక్డిన్ పరీక్షిస్తోంది.
తమ ప్రొఫైల్‌లో ఒక కంపెనీని ప్రస్తుత ఉద్యోగ సంస్థగా పేర్కొన్నవారు, ఆ సంస్థకు చెందిన అధికారిక ఆఫీస్ ఈమెయిల్ ద్వారా తమ ఉద్యోగాన్ని నిర్ధారించుకోవాల్సి రావచ్చు.
ఆ ఈమెయిల్‌కు పంపిన కోడ్‌ను నమోదు చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఏఐతో పెరుగుతున్న నకిలీ ప్రొఫైల్స్
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నమ్మదగినట్లుగా కనిపించే నకిలీ ప్రొఫైల్స్‌ను రూపొందించడం గతంతో పోలిస్తే సులభమైంది.
ఈ నేపథ్యంలోనే లింక్డిన్ తన వెరిఫికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది.
ముఖ్యంగా నకిలీ రిక్రూటర్లు, ఉద్యోగాల పేరుతో జరిగే ఆన్‌లైన్ మోసాలను తగ్గించడంలో కొత్త ఫీచర్లు ఉపయోగపడతాయని లింక్డిన్ భావిస్తోంది.
వివరాలు
ఫ్రీలాన్సర్లకు తప్పనిసరి కాదు
అయితే ఈ వెరిఫికేషన్ విధానాలన్నీ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కావు. ముఖ్యంగా ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి చేసుకునేవారికి సంస్థకు సంబంధించిన అధికారిక ఈమెయిల్ ఉండకపోవచ్చు.
అందువల్ల అలాంటి వారికి కంపెనీ ఈమెయిల్ ఆధారిత వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేయడం లేదని లింక్డిన్ తెలిపింది.