
సంక్రాంతి పండగ: మొదటి రోజు భోగి పండుగను జరుపుకునే విధానాలు
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. తెలుగు వారందరూ పండగను ఘనంగా చేసుకోవడానికి సిద్ధమైపోయారు. జనవరి 15వ తేదీన జరుపుకోబోతున్న ఈ పండగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
సంక్రాంతి అంటే కొత్త వెలుగు అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం అంటారు. ఈ సంక్రమణాన్నే మకర సంక్రాంతి అని పిలుస్తారు.
మొత్తం 12రాశుల్లోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. అందుకే సంవత్సరం పొడవునా 12సంక్రాంతులు ఉంటాయి. కానీ మకర సంక్రాంతిని మాత్రమే పండగలా చేసుకుంటారు.
తెలుగు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈ పండుగను 3రోజులు జరుకుంటే మరికొంత మంది నాలుగురోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత కొందరు ముక్కనుమ అని జరుపుకుంటారు. ముక్కనుమ రోజు మాంసంతో విందు చేసుకుంటారు.
సంక్రాంతి పండగ
భోగి పండగ జరుపుకునే విధానం
సంక్రాంతి పండగ రైతుల పండగ అని చెప్పవచ్చు. పొలాల్లోంచి పంట చేతికొచ్చి రైతు జేబులో డబ్బులు పడే సమయం ఇది. మొదటిరోజు భోగి జరుపుకుంటారు. ఈ రోజున తెల్లవారు జామున 3గంటలకే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు.
ఈ మంటల్లో పాతవస్తువులు వేస్తారు. ఈ మంటలు చలిని పారద్రోలేందుకే కాకుండా మనిషిలోని చెడును అంతం చేసేందుకే అని నమ్ముతారు.
భోగి మంటలతో కాచుకున్న వేడినీటితో స్నానం చేస్తారు. ఆ తర్వాత కొత్తబట్టలు కట్టుకుని అందంగా ముస్తాబు అవుతారు.
ఆడపిల్లలైతే ఇంటి ముందు ముగ్గులు వేసి అందులో రేగుపళ్ళు, గొబ్బెమ్మలు పెడతారు.
చిన్నపిల్లల తలమీద రేగుపళ్ళను అక్షింతలుగా జల్లుతారు. అలాగే బొమ్మరిల్లు కట్టి చిన్న మట్టిపాత్రల్లో పాలు పొంగిస్తారు.