కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వారు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి
దృష్టి లోపాలను సవరించడానికి కళ్ళద్దాలు పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. కళ్లద్దాలను పెట్టుకోవడం ఇష్టం లేనివారు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటారు. మీకీ విషయం తెలుసా? కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. లెన్స్ ధరించినపుడు చేసే కొన్ని పొరపాట్ల వల్ల కళ్ళు పాడవుతాయి. అవేంటో తెలుసుకుందాం. లెన్స్ పెట్టుకుని స్నానం, ఈత అసలే వద్దు: మీకెంత కంగారుగా ఉన్నా సరే లెన్స్ పెట్టుకుని స్నానం చేయకూడదు, ఈత కొట్టకూడదు. నీటిలో ఉండే సూక్ష్మ క్రిములను లెన్స్ ద్వారా కంటిలోపలికి వెళ్ళి కళ్ళను పాడుచేస్తాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా లెన్స్ కొనవద్దు: చాలామంది డాక్టర్ సలహా లేకుండా లెన్స్ కొంటుంటారు. కానీ అలా చేయకూడదు. దానివల్ల మీకు నష్టం కలుగుతుంది.
కళ్లను రుద్దితే చూపు కోల్పోయే ప్రమాదం
లెన్స్ పెట్టుకుని నిద్రపోవద్దు: రోజంతా లెన్స్ పెట్టుకున్నప్పుడు లెన్స్ లో బాక్టీరియా చేరుతుంది. పడుకునేటప్పుడు వాటిని తీయకుండా నిద్రపోతే, లెన్స్ లోని బాక్టీరియాతో పోరాడే శక్తి కార్నియాకు ఉండదు. ఈ కారణంగా కంటి సంబంధ సమస్యలు వస్తాయి. లెన్స్ పెట్టుకుని చిన్న కునుకు కూడా తీయకూడదు. లెన్స్ ఉన్నప్పుడు కళ్ళను రుద్దకూడదు: లెన్స్ పెట్టుకున్నప్పుడు కళ్ళను తరచుగా రుద్దడం వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. లెన్స్ పెట్టుకున్నప్పుడు దురదగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. లెన్స్ లను మిక్స్ చేయకండి: ఏ వైపు ఏ లెన్స్ పెట్టుకుంటున్నారో గుర్తుంచుకోండి. కుడివైపు పెట్టుకున్న లెన్స్ ని మళ్ళీ కుడివైపే పెట్టుకోండి. ఎడమవైపు నుండి తీసి మళ్ళీ ఎడమ వైపే పెట్టుకోండి.