మోటివేషన్: జీవితంలో రిస్క్ తీసుకోలేక జీవితాన్ని ఆనందించలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి
బంగారు సింహాసనంలో కూర్చున్నా, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోలేం. బోర్ కొట్టేస్తుంది. జీవితం కూడా అంతే. ఒకే పని చేసుకుంటూ చాలు కదా అని ఆలోచిస్తే అక్కడికే జీవితం ఆగిపోతుంది. అడుగు ముందుకు వేస్తే కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ఇంకాస్త ముందుకు వెళితే మరో ప్రపంచం ఎదురవుతుంది. అప్పుడు మీకు జీవించడానికి కొత్త ఉత్సాహం వస్తుంది. కానీ కొందరు అడుగు వేయడానికి భయపడతారు. జీవితంలో రిస్క్ తీసుకోలేరు. మీరు కూడా అలాంటి వాళ్ళే అయితే రిస్క్ తీసుకోవడానికి ఎలాంటి లక్షణాలను అలవర్చుకోవాలో తెలుసుకుందాం. నెగెటివ్ ఆలోచనలను మానుకోండి: రిస్క్ తీసుకోకపోవడానికి ముఖ్య కారణం నెగెటివ్ గా ఆలోచించడమే. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఏవైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఆలోచించడం ఇప్పుడే మానేయండి.
రిస్క్ తీసుకోవాలంటే అలవర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలు
ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించండి. మీరు వెళ్తున్న దారిలో సానుకూల ఫలితాలు వస్తాయని అనుకోండి. అలానే నమ్మండి. నో చెప్పేవాళ్ళను దూరం పెట్టండి. మీరు చేయబోయే పని జరగదని ఎవరైనా చెప్తే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోండి. రిస్క్ తీసుకోవాలంటే మీ చుట్టూ పాజిటివ్ పర్సన్స్ ఉండాలి. మీ మైండ్ సెట్ మార్చుకోండి. పడ్డవాడే గొప్పవాడు. వాడు మాత్రమే తన జీవితంలో అనుకున్నది సాధించుకుంటూ వెళ్తాడని గుర్తుంచుకోండి. మీ దారిలో మీరు పడినా కూడా ఆగిపోవద్దని మీ మెదడును ట్యూన్ చేసుకోండి. పరాజయాల నుండి నేర్చుకోండి. జీవితమన్నాక గెలుపోటములు సహజం. ఎప్పుడూ గెలిచేవాడి జీవితంలో పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఒక్కసారి ఓడిపోయిన వాడి జీవితంలో జీవితమే ఉంటుంది.