ప్రేరణ: అబద్ధాలు అలవాటుగా మారితే జీవితమే అబద్ధం అవుతుంది
నిజం నిప్పులాంటిది, అబద్ధం అప్పులాంటిది అంటారు. అంటే నిజం చెప్పినపుడు నిప్పులో మండుతున్నట్టుగా ఉంటుంది. అబద్ధం ఆడినప్పుడు అప్పు పెరిగినట్టుగా ఉంటుందని అర్థం. కానీ అప్పు పెంచుకోవడం కన్నా నిప్పుల్లో కాలడం మంచిది. ఎందుకంటే అప్పు పెరుగుతున్న కొద్దీ మీ గుండె మీద భారం పెరుగుతుంది. మీ జీవితంలో ఆనందం మాయమవుతుంది. ఇక్కడ కాలడం అంటే చనిపోవడమని కాదు, బాధను భరించడమని అర్థం. చాలామంది ఆ బాధలను భరించే ఓపిక లేకపోవడం వల్లే అబద్ధాలు ఆడుతుంటారు. ఒక్క అబద్ధం వంద అబద్ధాలకు దారి తీస్తుంది. అబద్ధాలు మాట్లాడేవాళ్ళకు జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండాలి. లేదంటే వాళ్ళు మాట్లాడేవి అబద్ధాలనేవి ఏదో ఒక సందర్భంలో అవతలి వారికి తెలిసిపోతుంది.
అందమైన అబద్ధం
అబద్ధం అందంగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఊహ ఉంటుంది. మనమేదైతే కావాలని కోరుకుంటామో అది మనకు దక్కనపుడు, అది మనకు దక్కినట్లుగా అవతలి వారికి చెప్పడం అందంగానే ఉంటుంది. కానీ అది అబద్ధం. చిన్న చిన్న అబద్ధాలు కూడా ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. అందుకే అబద్ధాలు ఆడటం తగ్గించండి. విపరీతంగా అబద్ధాలు ఆడే అలవాటు మీకున్నప్పుడు మీ జీవితంలో నిజం ఏంటనేది మీరు మర్చిపోతారు. అప్పుడు జీవితమే అబద్ధం అవుతుంది. మీకు లక్ష రూపాయల జీతం అని అబద్ధం చెప్పారనుకోండి. దాన్ని కవర్ చేయడానికి మీరు అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. ఖర్చులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో.. నిజం చెప్పేసి మీ జీవితాన్ని నిజంలో జీవించండి.