ప్రేరణ: సారీ చెప్పేంత ధైర్యం మీలో ఉంటే దేన్నయినా సాధించే గుణం మీలో ఉన్నట్టే
నన్ను క్షమించు అని అవతలి వారిని అడగాలంటే మనసులో చాలా ధైర్యం ఉండాలి. అది అందరిలో ఉండదు. సారీ చెప్పడం అంటే చిన్నతమని ఫీలైపోతారు. అహం అడ్డొస్తుంది. కానీ మీకీ విషయం తెలుసా? సారీ చెప్పడం వల్ల మీకే మంచి జరుగుతుంది. ఒకవిషయంలో మీ తప్పు నిజంగా ఉంటే మీరు సారీ చెప్పేయడమే మంచిది. ఒకవిషయంలో మీ తప్పు నిజంగా లేకపోయినా అవతలి వాళ్ళు మీకు ఆప్తులు అయితే మీ బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం సారీ చెప్పడం మంచిదే. నా తప్పు లేకపోయినా నేనెందుకు సారీ చెప్పాలని బిగపట్టుకుని కూర్చుంటే నువ్వో మంచి ఫ్రెండుని కోల్పోయిన వాడివి అవుతావు. మనుషులు అన్నాక ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి తప్పులు చేస్తాడు.
మనసును తేలిక చేసే సారీ
ఏ తప్పును పట్టించుకోకూడదో, ఏ తప్పును పట్టించుకోవాలో తెలుసుకుని సర్దుకుపోతే జీవితం హ్యాపీగా ఉంటుంది. సారీ చెప్పడం వల్ల మనసు తేలిక పడుతుంది. గుండె సాధారణ స్థాయిలో కొట్టుకుంటుంది. అప్పటివరకూ మీ మీద ఉన్న అహం అనే బరువు పడిపోయి మీరు ఫ్రీ ఐపోతారు. మరో విషయం ఏమిటంటే, సారీ చెప్పడం వల్ల మీరు నిజంగా తప్పు చేసినట్టు కాదు, ఆ తప్పు కన్నా బంధాలకు మీరు ఎక్కువ విలువ ఇస్తున్నారని అర్థం. ఈ విషయం అవతలి వాళ్ళకు అర్థం కాకపోయినా మీకు అర్థమైతే చాలు. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గుండెను బరువు చేసుకోవడం కన్నా, సారీ చెప్పేసి బరువు దించుకోవడమే మేలు.