ప్రేరణ: ఇతరులను దాటేయాలని పనిచేసే వాళ్ళకు అశాంతే మిగులుతుంది
నువ్వు పనిచేసేది అవతలి వాళ్ళను దాటేయడానికే అయితే నీకెప్పటికీ సుఖం ఉండదు. ఎందుకంటే నువ్వు ఇతరులను దాటుతున్న కొద్దీ నిన్ను ఇతరులు దాటేస్తూ ఉంటారు. అలా ఆ పోటీలో ఒక్కోసారి నువ్వు అవతలి వారిని దాటేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నీకు అశాంతి ఎక్కువైపోతుంది. నీ మీద నీకే కోపం వస్తుంది. నీ పరువు పోయినట్లుగా ఫీలవుతావ్, నలుగురికి నీ ముఖం చూపించాలంటే ఇబ్బందిగా అనుకుంటావ్. అందుకే ఎప్పుడైనా ఏ పని చేసినా అవతలి వాళ్ళకోసం చేయకూడదు. అంటే, అవతలి వాళ్ళను దాటేయాలని, మీ దృష్టిని వాళ్ళమీద పెట్టకూడదు. మీరు చేస్తున్న పనిని నిజాయితీగా చేయండి. అప్పుడే మీకు మీరు చేస్తున్న పనిలో ఆనందం దొరుకుతుంది.
పోలికతో పెను ప్రమాదాలు
అవతలి వాళ్ళను క్రాస్ చేయాలన్న కోరిక మీలో ఉన్నప్పుడు, మీరు మిమ్మల్ని అవతలి వాళ్ళతో పోల్చుకుంటారు. పోలికల వల్ల పెద్ద పెద్ద నష్టాలు జరుగుతాయి. మిమ్మల్ని ఎదుటి వారితో పోల్చుకుంటే అవతలి వాళ్ళు మీకంటే తక్కువ స్థాయి అయితే మీకు ఆనందం వస్తుంది. మీకంటే ఎక్కువ స్థాయి అయితే మీకు అశాంతి కలుగుతుంది. చాలావరకు తమకంటే పెద్దస్థాయిలో ఉన్నవారితోనే పోల్చుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. అందుకే అనవసర అశాంతి కలుగుతుంది. ఏ విషయంలోనైనా అవతలి వారితో పోలికలు పెట్టుకుని వారికంటే పైకి వెళ్ళిపోవాలని పరుగులు పెడితే కాళ్ళు విరిగిపోయి ఉన్నచోటు నుండి కదల్లేని పరిస్థితి రావచ్చు. అందుకే పోల్చుకోవడం వెంటనే మానెయ్యి.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి