జాతీయ అంతరించిపోతున్న జీవాల దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, చేయాల్సిన పనులు
ఈ భూమి మీద ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. వాటన్నింటిలో మనిషి కూడా ఒకడు. ప్రస్తుతం చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. భూమి మీద జీవవైవిధ్యం ఉండాలంటే వివిధ రకాల జాతులు అంతరించిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే జాతీయ అంతరించిపోతున్న జీవాల దినోత్సవాన్ని తీసుకొచ్చారు. ప్రతీ సంవత్సరం మే నెలలో మూడవ శుక్రవారం రోజున జాతీయ అంతరించిపోతున్న జీవాల దినోత్సవాన్ని జరుపుతారు. అంతరించిపోతున్న జాతులను రక్షించడంపై అవగాహన కలిగించడానికి ఈరోజును జరుపుతారు. సాధారణంగా ఈ రోజున స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు కలిసి అంతరించిపోతున్న జీవాలను ఎలా కాపాడాలో, భూమి మీద వాటి ఆవాసాలకు ఎలాంటి సదుపాయాలు సమకూర్చాలో మాట్లాడతారు.
ఆధారపడటం ప్రతీ జీవికీ అలవాటు
2006లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం జరుపుకోవాలని నిర్ణయించింది. పర్యావరణ వ్యవస్థ బాగుండడానికి ఈ భూమి మీద నివసించే ప్రతీ ప్రాణి ఎంతో కొంత సాయం చేస్తుంది. ఒకవేళ భూమి మీద ప్రాణులు ఒక్కొక్కటిగా అంతరించిపోతుంటే మానవజాతి మనుగడ ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంది. ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవి, మరో జీవి పైన ఆధారపడుతుంది. అందుకే భూమి మీద జీవాలను అంతరించిపోకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయంలో జనాలకు అవగాహన కల్పించడానికి అలాగే అంతరించిపోయే దశలో ఉన్న జీవాలకు ఆవాసాలను కల్పించి, ఆ జీవాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలి.