నిత్యం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు
ఈ కాలంలోనే కాదు ఏ కాలంలో అయినా అన్నింటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. డబ్బు లేకపోతే ఎలాగోలా బతుకు బండిని నడిపించవచ్చు కానీ ఆరోగ్యం లేకపోతే బతుకు బండి ముందుకు నడవదు. అందుకే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా అలవాట్లను అలవర్చుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతుంటాయి. అవి పెరగకుండా నిత్య యవ్వనంతో కనిపించడానికి కొన్ని నియమాలు పాటించాలి. వ్యాయామం: ఆరోగ్యాన్ని అందించే మొదటి అంశం ఇదే. రోజూ ఎంత పనిచేసినా కనీసం అరగంట సేపైనా వ్యాయామానికి కేటాయించండి. ఆహారం: పోషకాలున్న ఆహారాన్ని తీసుకోండి. ఈ మధ్య ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అది కోరి కోరి అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి.
ఆరోగ్యాన్ని అందించే సూత్రాలు
విటమిన్ డి: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఎముకలకు విటమిన్ డి ఖచ్చితంగా అవసరం. అది సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. కాబట్టి ఒక 15నిమిషాలు ఎండలో నిల్చోండి. మంచి ఆలోచన: ఆరోగ్యం అంటే శరీరానికి సంబంధించిందే అని చాలామంది అనుకుంటారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది పూర్తి ఆరోగ్యం అవుతుంది. మీ చుట్టూ పాజిటివ్ ఆలోచనలను పెంచే వారిని ఉంచుకోండి. నిద్ర: ఈ గజిబిజి జీవితంలో ఎక్కువ మంది నిద్రకు దూరమై అనారోగ్యానికి దగ్గరవుతున్నారు. కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం. మంచినీళ్ళు: ఈ విషయంలో అశ్రద్ధ వహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. శరీరానికి కావాల్సినంత నీటిని అందించాలి. లేకపోతే అది కిడ్నీల మీద ప్రభావం చూపి అనారోగ్యాన్ని తీసుకొస్తుంది.