కృష్ణాష్టమి సందర్భంగా భగవంతుడికి సమర్పించాల్సిన నైవేద్యములు, వాటిని తయారు చేసే విధానములు
శ్రావణమాసంలో వచ్చే పండగ శ్రీకృష్ణ జన్మాష్టమి. తెలుగు వాళ్ళు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున కృష్ణ భగవానుడికి నైవేద్యాలు సమర్పిస్తారు. కొత్తబట్టలు ధరించి శ్రీకృష్ణ ఆలయాలకు వెళ్లి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని రకాల నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
బెల్లం అటుకులు
శ్రీకృష్ణుడికి అటుకులు చాలా ఇష్టమైన ఆహారం. అందుకే ఈరోజు అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. లావుపాటి అటుకులను ఒక కప్పు తీసుకొని, వాటిని రెండు నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత నీటిని వడపోసి గంటసేపు అటుకులను పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాత్రలో నెయ్యి వేసి కాసేపు మరిగించాలి. ఆ తర్వాత దాంట్లో కాజు, యాలకుల పొడి, బెల్లం వేసి వేయించాలి. ఆ తర్వాత అటుకులను స్టవ్ మీద ఉన్న బెల్లం పాకంలో వేసి నెమ్మదిగా కలపాలి. అంతే బెల్లం అటుకులు నైవేద్యం తయారైపోయింది.
కొబ్బరి లడ్డు
దీనికోసం 400 గ్రాముల పాలు, మూడు కప్పుల కొబ్బరి తురుము, అరకప్పు నెయ్యి కావాలి. ఒక పాత్రలో పాలు పోసి అందులో మూడు కప్పుల కొబ్బరి తురుము వేసి స్టవ్ మీద ఉంచాలి. తక్కువ మంటతో కాసేపు వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పాత్రలోని కొబ్బరి తురుము, పాలు కలిసి గడ్డ కట్టినట్టుగా మారుతాయి. ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని లడ్డూ లాగా తయారు చేయాలి. అంతే కొబ్బరి లడ్డు తయారైపోయింది.
మినప సున్ని ఉండలు
ఒక కప్పు మినప గుండ్లను చిన్న పాత్రలో వేసి వేయించాలి. పది నిమిషాల తర్వాత మినప గుండ్లు బాగా వేగుతాయి. ఆ తర్వాత మినపగుండ్లను గ్రైండర్లో వేసి పిండి తయారు చేసుకోవాలి. ఈ పిండికి బెల్లం కూడా కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మినప గుండ్లు, బెల్లం కలపగా వచ్చిన పిండికి అరకప్పు నెయ్యిని కలిపి ఉండల మాదిరిగా తయారు చేసుకోవాలి. అంతే సున్నుండలు తయారైనట్టే.