'Eat faster':31 నిమిషాల లంచ్ చేస్తే 7 గంటల వరకు పని.. 'Eat Faster' నోటీసు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగులు భోజన విరామాన్ని కేటాయించిన సమయం కంటే ఒక్క నిమిషం ఎక్కువ తీసుకున్నా గంటపాటు అదనంగా పని చేయాలంటూ పేర్కొన్న ఓ ఆఫీస్ నోటీసు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నోటీసు ఉద్యోగుల హక్కులు,కార్యాలయ సంస్కృతి,పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత వంటి అంశాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న నోటీసు ప్రకారం,ఉద్యోగులకు 30నిమిషాల లంచ్ బ్రేక్ మాత్రమే అనుమతిస్తారు. ఆ సమయాన్ని మించి ప్రతి నిమిషం ఆలస్యమైతే సాయంత్రం 6 గంటల తర్వాత 60నిమిషాల పాటు వేతనం లేకుండా అదనంగా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. "లంచ్ బ్రేక్ 30నిమిషాలు దాటితే, అదనంగా తీసుకున్న ప్రతి నిమిషానికి 60నిమిషాల పాటు వేతనం లేకుండా పనిచేయాల్సి ఉంటుందని నోటీసులో స్పష్టం చేశారు.
వివరాలు
"త్వరగా తినండి" అంటూ స్పష్టమైన హెచ్చరిక
అంతేకాకుండా, "ఉదాహరణకు 31 నిమిషాలు లంచ్ చేస్తే మీరు సాయంత్రం 7 గంటలకు మాత్రమే కార్యాలయం నుంచి వెళ్లవచ్చు" అని వివరించారు. చివర్లో "త్వరగా తినండి" అంటూ స్పష్టమైన హెచ్చరిక కూడా జత చేశారు. ఈ నోటీసు సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు ఈ విధానం చట్టబద్ధమేనా అని ప్రశ్నించారు. ఒక్క నిమిషం ఆలస్యానికి గంటపాటు ఉచితంగా పని చేయించడం అన్యాయమని విమర్శించారు.
వివరాలు
వైరల్ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు
ఒక వినియోగదారు వ్యంగ్యంగా స్పందిస్తూ, ఉద్యోగులు కూడా కార్యాలయ సమయం దాటిన ప్రతి నిమిషానికి అదనంగా గంట జీతం డిమాండ్ చేయాలని వ్యాఖ్యానించారు. మరికొందరు ఇలాంటి కఠిన నిబంధనల కారణంగానే తాము వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను ఇష్టపడతామని తెలిపారు. అయితే కొందరు భిన్నంగా స్పందించారు. వ్యాపార యజమానులు కూడా ఎక్కువసేపు పనిచేస్తారని, ఉద్యోగులు కార్యాలయ సమయాలను గౌరవించాలని అభిప్రాయపడ్డారు. అయితే,నోటీసులో సంస్థ పేరు ప్రస్తావించకపోవడంతో ఇది నిజంగానే ఏదైనా కంపెనీ విడుదల చేసిందా? లేక సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎవరైనా సృష్టించారా? అనే సందేహాలను పలువురు నెటిజన్లు వ్యక్తం చేశారు.