చిగుళ్ళ వాపు నుండి నోటి దుర్వాసన పోగొట్టడం వరకు ఆయిల్ పుల్లింగ్ వలన కలిగే ప్రయోజనాలు
ఆయిల్ పుల్లింగ్ అనేది పురాతన ప్రక్రియ. నోట్లోని చెడు బాక్టీరియాను బయటకు లాగేసి, నోటిని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రక్రియ ఇది. ఆయిల్ పుల్లింగ్ వల్ల పంటిచిగుళ్ళు బలంగా ఉంటాయి. నోటి దుర్వాసన దూరమవుతుంది. మరి ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి? ఏ విధంగా చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె గానీ ఆలివ్ ఆయిల్ గానీ లేదా నువ్వుల నూనె తీసుకుని నోట్లో వేసుకుని నోరంతా తిప్పుతూ ఉండండి. ఆయిల్ ని మింగకూడదు. 20నిమిషాల తర్వాత ఆయిల్ ని ఉమ్మివేయండి. బాత్రూమ్ లో, సింక్ లో ఉమ్మివేయకండి. ఆయిల్ వల్ల సింక్ మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నీళ్ళతో పుక్కిలించి ఉమ్మివేయాలి.
ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియపై సైన్స్ ఏం చెబుతోంది
ఆయిల్ ని నోట్లో వేసుకుని తిప్పడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అయ్యి, హాని కలిగించే నోట్లోని బాక్టీరియాలను చంపేస్తాయి. ఎక్కువ మోతాదులో ఆయిల్ తీసుకుంటే ఎక్కువశాతం బాక్టీరియాలను చంపవచ్చని సైన్స్ చెబుతోంది. నోటిలో దాదాపు 700రకాల బాక్టీరియాలు ఉంటాయి. ఆయిల్ పుల్లింగ్ ద్వారా ఇవి చనిపోతాయి. హానిచేసే బాక్టీరియా బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి చిగుళ్లవాపు వంటి సమస్యలు తలెత్తవు. ఒకానొక స్టడీ ప్రకారం చిగుళ్లవాపుతో బాధపడుతున్న 60మందిలో ఆయిల్ ఫుల్లింగ్ ద్వారా ఆ సమస్య తీరినట్లు తెలుస్తోంది. నోరు శుభ్రంగా లేకపోవడం వల్ల నోటి నుండి దుర్వాసన వస్తుంది. 2011లో బయటకు వచ్చిన స్టడీ ప్రకారం, నోటి దుర్వాసన పోగొట్టడంలో మౌత్ వాష్ కంటే ఆయిల్ పుల్లింగ్ ఎక్కువ ప్రభావం చూపింది.