Jowar Uttapam : జొన్నపిండితో ఊతప్పం.. సుతిమెత్తగా, క్రిస్పీ టేస్ట్ గ్యారెంటీ!
ఈ వార్తాకథనం ఏంటి
చాలా మందికి ఊతప్పం అంటే ప్రత్యేకమైన ఇష్టం. పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం, ఉల్లిపాయ వంటి కూరగాయలు వేసి చేయడం వల్ల ఇది చూడటానికి కలర్‌ఫుల్‌గా, తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో దోసె లేదా ఇడ్లీ పిండి మిగిలిందంటే చాలామంది ముందుగా ఊతప్పమే చేయాలని ఆసక్తి చూపిస్తారు. అయితే పిండి లేకపోయినా కూడా టేస్టీగా ఊతప్పం తయారు చేయవచ్చని మీకు తెలుసా? ఇందుకు జొన్నపిండి ఒక్కటే చాలు. సరైన స్టెప్స్ ఫాలో అయితే ఈ ఊతప్పం క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, చాలా రుచిగా తయారవుతుంది. వంటలో కొత్తవాళ్లు కూడా ఈ టిప్స్ పాటిస్తూ ఈజీగా చేసేయొచ్చు. ఈ జొన్న ఊతప్పాన్ని పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచి మరింత పెరుగుతుంది.
Details
కావాల్సిన పదార్థాలు:
మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బొంబాయి రవ్వ - అర కప్పు పెరుగు - అర కప్పు జొన్నపిండి - ఒక కప్పు క్యారెట్ - 1 ఉల్లిపాయ - 1 పచ్చిమిర్చి - 3 అల్లం తరుగు - 1 టేబుల్ స్పూన్ టమోటా - 1 జీలకర్ర - అర టీ స్పూన్ కరివేపాకు తరుగు - కొంచెం కొత్తిమీర తరుగు - కొద్దిగా వాము - అర టీ స్పూన్ వంటసోడా - చిటికెడు ఉప్పు - రుచికి సరిపడా నెయ్యి - తగినంత
Details
తయారీ విధానం
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు జొన్నపిండి, అర కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పెరుగు వేసి, ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమంపై మూత పెట్టి సుమారు 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈలోపు ఒక క్యారెట్, ఒక టమోటా, మూడు పచ్చిమిర్చులు, ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి సిద్ధంగా ఉంచాలి. 15 నిమిషాల తర్వాత పిండి మిశ్రమంలో కొద్దిగా నీరు వేసి మళ్లీ కలపాలి. అందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసుకోవాలి.
Details
ఇలా చేస్తే సరిపోతుంది
అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ వాము, చిటికెడు వంటసోడా, రుచికి సరిపడా ఉప్పు వేసి మిశ్రమం మొత్తం బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి స్ప్రెడ్ చేయాలి. అనంతరం గరిటెతో పిండిని తీసుకుని ఊతప్పం మాదిరిగా పాన్‌పై పోయాలి. పాన్‌పై మూత పెట్టి మీడియం మంటలో మూడు నిమిషాల పాటు కాల్చాలి. ఆ తర్వాత ఊతప్పాన్ని మరోవైపు తిప్పి దోరగా కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే... జొన్నపిండితో చేసిన నోరూరించే ఊతప్పం రెడీ! ఇలా ఇంట్లో చేసి పెడితే ఇంటిల్లిపాదీ మళ్లీ మళ్లీ చేయమని అడగడం ఖాయం