Lower Stress Hormones: పిల్లులు, కుక్కలతో 10 నిమిషాలు ఆడితే ఒత్తిడి తగ్గుతుందట.. పరిశోధనలో వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
పిల్లులు, కుక్కలతో కేవలం 10 నిమిషాల పాటు ఆడుకోవడం వల్ల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మనుషులు పెంపుడు జంతువులతో సమయం గడిపినప్పుడు శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయులు తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పిల్లులు, కుక్కలు మనుషులకు ఆనందాన్ని అందిస్తాయని చాలామందికి తెలుసు. అయితే, వాటితో కొద్దిసేపు గడపడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని ఈ పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు కొన్ని విశ్వవిద్యాలయాలు థెరపీ డాగ్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
వివరాలు
300 మంది విద్యార్థులతో పరిశోధన
అయితే, ప్రయోగశాల బయట సాధారణ పరిస్థితుల్లో పిల్లులు, కుక్కలతో గడపడం వల్ల ఒత్తిడి నిర్వహణపై ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలించిన తొలి అధ్యయనం ఇదేనని పరిశోధకులు తెలిపారు.
వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో మానవ అభివృద్ధి విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ప్యాట్రిషియా పెండ్రి మాట్లాడుతూ.. కేవలం 10నిమిషాల సమయం కూడా గణనీయమైన మార్పును తీసుకురాగలదని చెప్పారు.
తమ అధ్యయనంలో పిల్లులు, కుక్కలతో నేరుగా గడిపిన విద్యార్థుల్లో ఒత్తిడిని సూచించే ప్రధాన హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయులు గణనీయంగా తగ్గినట్లు వివరించారు.
'AERA Open' జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో దాదాపు 300 మంది డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.
వీరంతా చివరి పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో పరిశోధన నిర్వహించారు.
విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించారు.
వివరాలు
ఒక్కో బృందానికి ఒక్కో విధమైన పరీక్ష
మొదటి బృందంలోని విద్యార్థులకు చిన్న చిన్న సమూహాలుగా పిల్లులు, కుక్కలతో 10 నిమిషాల పాటు నేరుగా గడిపే అవకాశం కల్పించారు.
వారు తమకు నచ్చిన విధంగా జంతువులతో ఆడుకోవడానికి, వాటిని నిమరడానికి అనుమతించారు.
రెండో బృందంలోని విద్యార్థులు తమ వంతు వచ్చే వరకు ఇతరులు జంతువులను నిమురుతుండటాన్ని గమనించారు.
మూడో బృందానికి ఆ కార్యక్రమంలో ఉన్న పిల్లులు, కుక్కల చిత్రాలతో కూడిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు.
నాలుగో బృందంలోని విద్యార్థులు ఎలాంటి వినోదం లేదా ఇతర ఆకర్షణలు లేకుండా 10 నిమిషాల పాటు ప్రశాంతంగా వేచి ఉన్నారు.
ఆ తర్వాత వారికి కూడా జంతువులతో గడిపే అవకాశం ఉంటుందని చెప్పారు.
వివరాలు
లాలాజల పరీక్షల్లో తగ్గిన ఒత్తిడి హార్మోన్ స్థాయులు
ఈ పరిశోధనలో భాగంగా విద్యార్థులు పిల్లులు, కుక్కలతో గడపడానికి ముందు, ఆ తర్వాత వారి లాలాజల నమూనాలను సేకరించారు.
వాటిని పరీక్షించగా, జంతువులతో నేరుగా ఆడుకున్న మొదటి బృందంలోని విద్యార్థుల్లో కార్టిసాల్ స్థాయులు ఎక్కువగా తగ్గినట్లు గుర్తించారు.
మిగతా మూడు బృందాలతో పోలిస్తే వీరిలోనే స్పష్టమైన మార్పు కనిపించింది.
విద్యార్థులు పెంపుడు జంతువులతో గడపడం వల్ల ఆనందంగా ఉంటారని, వారిలో సానుకూల భావనలు పెరుగుతాయని గతంలో నిర్వహించిన పరిశీలనల్లో గుర్తించామని ప్యాట్రిషియా పెండ్రి తెలిపారు.
అయితే, ఈ ప్రభావాన్ని కేవలం వ్యక్తుల అనుభూతుల ఆధారంగా కాకుండా, శరీరంలో జరిగే మార్పుల ద్వారా కూడా నిర్ధారించగలమా అని పరిశోధకులు తెలుసుకోవాలనుకున్నారని చెప్పారు.
పరీక్షల ద్వారా ఒత్తిడి హార్మోన్ల స్థాయులు తగ్గినట్లు గుర్తించామని వివరించారు.
వివరాలు
లాలాజల పరీక్షల్లో తగ్గిన ఒత్తిడి హార్మోన్ స్థాయులు
ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు తగ్గడం వల్ల దీర్ఘకాలంలో శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు జరిగే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా పెంపుడు జంతువులను నిమరడం, వాటితో నేరుగా గడపడం వల్ల ఆందోళన తగ్గడంలో ప్రత్యేకమైన ప్రభావం ఉండవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది.