R21: ప్రపంచాన్ని మార్చే శక్తిగా మారనున్న మలేరియా వ్యాక్సిన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో సరికొత్త విప్లవం వచ్చింది. మలేరియా వ్యాధిని నివారించడానికి కొత్త వ్యాక్సిన్ వచ్చేసింది. R21 లేదా మ్యాట్రిక్స్ -ఎమ్ పేరుతో పిలవబడుతున్న ఈ వ్యాక్సిన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఊహించిన 75శాతం సమర్థతను అందుకుంది. దాంతో ప్రపంచాన్ని మార్చే శక్తిగా, ఈ వ్యాక్సిన్ మారబోతుందని అంటున్నారు. ఆమోదించిన ఘనా దేశం: R21 వ్యాక్సిన్ ని ఆమోదించాలన్న ఆలోచనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంటే, ఘనా దేశం మాత్రం ఆమోద ముద్రను అందించింది. 3-5సంవత్సరాల పిల్లలకు ఈ వ్యాక్సిన్ ని ఉపయోగించవచ్చని ఘనా దేశం ఆమోద ముద్ర వేసింది. ఘనా దేశంలో మలేరియా బారిన పడిన పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఒక వరం కావాలని ఆక్స్ ఫర్డ్ తెలియజేసింది.
ఆక్స్ ఫర్ట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 6,27,000మంది మలేరియా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలు ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఆఫ్రికాలో మలేరియా మరణాలు చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వ్యాక్సిన్ ని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. మలేరియాకు కారణమయ్యే ప్లాస్లోడియం స్పోరోజైట్ అవశేషాలను మొదటి దశలోనే ఈ వ్యాక్సిన్ అంతమొందిస్తుంది. భారతదేశానికి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ కూడా ఈ వ్యాక్సిన్ డోసులను తయారు చేయడంలో పాలు పంచుకుంటోంది. 200మిలియన్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేయాలని సీరం ఇన్స్టిట్యూట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఘనా దేశంలో అక్రా ప్రాంతంలో వ్యాక్సిన్ ఫ్యాక్టరీని నిర్మించాలని సీరం ఇన్స్టిట్యూట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులో లేదు.