పెట్: కుందేలు పెంచుకుంటున్నారా? దానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో చూడండి
కుందేళ్ళను పెంచుకునేవారు పాలకూర, క్యారెట్ తప్ప వేరే ఆహారాలు కుందేలుకు ఇవ్వరు. కుందేలుకు ఎలాంటి ఆహారాలు అందించాలో ఇక్కడ తెలుసుకుందాం. తిమోతి ఎండుగడ్డి: ఈ గడ్డి తినడాన్ని కుందేళ్ళు ఇష్టపడతాయి. కుందేళ్ల డైట్ లో తిమోతి గడ్డి ఎక్కువశాతం ఉంటుంది. మార్కెట్ లో ఈ గడ్డి కొనేటపుడు అది తాజాగా ఉందో లేదో చెక్ చేయండి. దుమ్ము పట్టిన గడ్డిని తినడం వల్ల కుందేళ్ళు ఇబ్బంది పడతాయి. కూరగాయలు: కుందేళ్ళకు తినిపించే ఏ ఆహారమైనా తాజాగా ఉండాలి. వయసులో ఉన్న కుందేళ్ళకు 2కప్పులు, పిల్ల కుందేళ్ళకు ఒక కప్ మాత్రమే కూరగాయలను ఇవ్వాలి. కూరమిరప, దోసకాయ, క్యారెట్, పాలకూర, ముల్లంగి, గోధుమగడ్డి, గుమ్మడికాయ, నీటిలో పెరిగే మొక్కలు, మొలకలు పెట్టవచ్చు.
పండ్లు, పువ్వులు, మూలికల్లో కుందేలుకు ఆహారంగా పెట్టగలిగే పదార్థాలు
పండ్లు: వారంలో కేవలం ఒకరోజు మాత్రమే కుందేలుకు పండ్లను ఆహారంగా పెట్టాలి. అది కూడా గింజలు లేకుండా ఇవ్వాలి. అరటిపండు, ఆపిల్స్(విత్తనాలు లేకుండా), నారింజ(విత్తనాలు లేకుండా), చెర్రీ(విత్తనాలు లేకుండా), ఫైనాపిల్, ద్రాక్ష, బెర్రీలు పెట్టవచ్చు. తినదగిన పువ్వులు, పూలరేకులు: కుందేళ్ళు పువ్వులు తింటాయని చాలామందికి తెలియదు. ఐతే అలంకరణ కోసం పెంచే పువ్వులను కుందేళ్ళకు పెట్టరాదు. బంతిపువ్వు, లావెండర్, సూర్యపువ్వు, గులాబీ పువ్వులను ఆహారంగా పెట్టవచ్చు. మూలికలు: ఆరోగ్యకరమైన మూలికలను కుందేళ్ళు తింటాయి. కొత్తిమీర, పెప్పర్ మింట్, తులసి, ఒరెగానో, రోజ్మేరీ ఇవ్వవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ మూలికలను చాలా తక్కువ మొత్తంలో ఇవ్వాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇవ్వకుండా నెమ్మదిగా అలవాటు చేయాలి.