Sri Ram puja: అయోధ్య రామాలయం ప్రారంభోత్స వేళ.. మీ ఇంట్లోనే శ్రీరాముడిని ఈ విధానంలో పూజించండి
సనాతన ధర్మంలో శ్రీరాముని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రీరాముడిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతారు. జనవరి 22 అనేది శ్రీరాముని ఆరాధనకు చాలా పవిత్రమైనది. అందుకే అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి అదే తేదీని ఎంచుకున్నారు. అయోధ్యలో జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి అందరూ హాజరు కాలేరు. అయితే ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో మీ పూజ గదిలోనే శ్రీరాముడిని పూజించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 12:29 pm 8 సెకన్ల నుంచి 12:30 pm 32 సెకన్ల మధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో పూజలు చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలను అనుసరించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరాముడి పూజ ఇలా చేయాలి
నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఉపవాస దీక్ష చేపట్టాలి. రాముడి చిత్ర పటం ఉంచిన స్థలాన్ని గోమూత్రం లేదా గంగాజలంతో శుద్ధి చేయాలి. ఆ ప్రదేశంలో చెక్కను ఏర్పాటు చేసి.. దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరచి శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఒక కలశాన్ని కూడా ఏర్పాటు చేయాలి. శ్రీరాముడి విగ్రహంతో పాటు కలశానికి కూడా తిలకం పెట్టాలి. తర్వాత రాముడి విగ్రహం ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించి, స్వామికి పూలమాల వేయాలి. శ్రీరాముడికి ధూప, దీపాలను అందించాలి. స్వామివారిని పసుపు బట్టలు, పవిత్ర దారంతో అలంకరించాలి. శ్రీరాముడికి ఇంట్లో చేసిన ప్రసాదాన్ని నైవేధ్యంగా సమర్పించాలి. చివరగా హారతి ఇస్తే.. పూజ ముగుస్తుంది.