Loading...
Remote work: రిమోట్ వర్క్‌తో పెరుగుతున్న ఒంటరితనం.. తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే?
రిమోట్ వర్క్‌తో పెరుగుతున్న ఒంటరితనం.. తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే?

Remote work: రిమోట్ వర్క్‌తో పెరుగుతున్న ఒంటరితనం.. తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉదయం ల్యాప్‌టాప్‌ తెరిచి పని ప్రారంభిస్తాం. మధ్యలో కాఫీ కోసం లేచినా పలకరించేందుకు సహోద్యోగి కనిపించడు. మీటింగ్‌ మొదలయ్యే ముందు సరదాగా రెండు మాటలు మాట్లాడే అవకాశం ఉండదు. సాయంత్రం పని ముగిసినా అదే గది.. అదే వాతావరణం. రోజంతా మనుషులతో అనుసంధానమై ఉన్నట్టే అనిపించినా.. వాస్తవానికి మనతో ఎక్కువసేపు ఉండేది స్క్రీన్‌ మాత్రమే. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల్లో కనిపించని ఒంటరితనానికి ఇదే కారణమవుతోందా? కరోనా తర్వాత పెరిగిన రిమోట్‌ వర్క్‌ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు పరిశోధకులు అధ్యయనం చేశారు.

వివరాలు 

పెరుగుతున్న ఒంటరితనం

'సైన్స్‌' జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం రిమోట్‌ వర్క్‌, ఒంటరితనం, మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధంపై దృష్టి సారించింది.

కరోనా మహమ్మారి తర్వాత ఇంటి నుంచి పనిచేసే విధానం విస్తరించడంతో ఉద్యోగులు ఒంటరిగా గడిపే సమయం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.

దీనికి అనుగుణంగా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాల సూచనలు కూడా కనిపించాయని తెలిపారు.

నటాలియా ఇమాన్యుయేల్‌, ఎమ్మా హారింగ్టన్‌, అమాండా పల్లైస్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనం నిర్వహించింది.

2011 నుంచి 2024 మధ్య ఐదు సర్వేల్లో పాల్గొన్న 5,88,322 మంది అమెరికా ఉద్యోగుల సమాచారాన్ని పరిశీలించారు.

కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న 2020, 2021 సంవత్సరాలను మాత్రం అధ్యయనంలో చేర్చలేదు.

వివరాలు 

ఒంటరిగా జీవించేవారిపై ప్రభావం ఎక్కువ

ఇంటి నుంచి పనిచేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఒకే స్థాయిలో ఒంటరితనాన్ని అనుభవించరు.

కుటుంబ సభ్యులతో కలిసి నివసించేవారికి ఇంట్లోనే కొంత సామాజిక అనుసంధానం కొనసాగుతుంది.

అయితే ఒంటరిగా జీవించే ఉద్యోగులకు పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు.

ఆఫీసు అనేది కేవలం పని చేసే ప్రదేశం మాత్రమే కాదు.. రోజువారీ మానవ సంబంధాలు ఏర్పడే వేదిక కూడా.

డెస్క్‌ దగ్గర సహోద్యోగితో చిన్న సంభాషణ, కాఫీ తీసుకునే సమయంలో పలకరింపు, మీటింగ్‌ ప్రారంభానికి ముందు సరదా మాటలు.. ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపిస్తాయి.

కానీ ఇలాంటి క్షణాలే రోజులో ఇతరులతో కలిసే అవకాశాలను పెంచుతాయి. ఇంటి నుంచే పనిచేసే సమయంలో ఈ అనుకోని పరిచయాలు క్రమంగా తగ్గిపోతాయి.

ADVERTISEMENT

వివరాలు 

మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం

ఫలితంగా ఒంటరిగా జీవించేవారిలో సామాజిక దూరం, ఒంటరితనం మరింత ఎక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది.

పరిశోధకుల అంచనా ప్రకారం.. 2011-2019 కాలంతో పోలిస్తే 2022-2024 మధ్య కనిపించిన ఒంటరితనం, మానసిక ఒత్తిడిలో దాదాపు మూడో వంతు పెరుగుదలకు రిమోట్‌ వర్క్‌ ఒక కారణమై ఉండొచ్చు.

ఇదే సమయంలో మానసిక ఆరోగ్య సేవలను పొందడం, సంబంధిత మందుల వినియోగం కూడా పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించారు.

అయితే ఈ ఫలితాలను అర్థం చేసుకునేటప్పుడు కొన్ని పరిమితులను గుర్తుంచుకోవాలి.

ఇంటి నుంచి పనిచేయడమే డిప్రెషన్‌కు ప్రత్యక్ష కారణమని అధ్యయనం నిర్ధారించలేదు.

అలాగే రిమోట్‌ వర్క్‌ చేస్తున్న ప్రతి ఉద్యోగికీ తప్పనిసరిగా ఇలాంటి మానసిక సమస్యలు వస్తాయని కూడా పరిశోధకులు చెప్పడం లేదు.

ADVERTISEMENT

వివరాలు 

పరిష్కారం ఆఫీసుకు వెళ్లడమేనా?

రిమోట్‌ వర్క్‌, ఒంటరితనం, మానసిక ఆరోగ్యం మధ్య సంబంధాన్ని సూచించే ఆధారాలుగానే ఈ ఫలితాలను చూడాలి.

ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రయాణ సమయం, ఖర్చు తగ్గడం, పని విషయంలో వెసులుబాటు పెరగడం, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకోవడం సులభం కావడం వంటి అంశాలు మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడవచ్చు.

అందువల్ల వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలనే విధానమే ప్రతి సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు.

వివరాలు 

పరిష్కారం ఆఫీసుకు వెళ్లడమేనా?

రిమోట్‌ వర్క్‌ ప్రయోజనాలను కొనసాగిస్తూనే ఉద్యోగులకు సామాజిక సంబంధాలు పెంచుకునే అవకాశాలను ఎలా కల్పించాలన్నదే ముఖ్యమైన ప్రశ్న.

సహోద్యోగులతో ఆన్‌లైన్‌ కాకుండా ప్రత్యక్షంగా మాట్లాడే సమయాలు, బృంద సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో క్రమం తప్పకుండా గడిపే సమయం.. ఇలాంటి చర్యలు ఒంటరితనాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. ఎందుకంటే రోజులో పెద్దగా గుర్తుండని ఆ ఐదు నిమిషాల పలకరింపే.. కొన్నిసార్లు మనసుకు ఎంతో ఊరటనిచ్చి, ఒంటరితనాన్ని దూరం చేసే చిన్న కారణంగా మారవచ్చు.

ADVERTISEMENT