రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి రావడంతో, ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఐతే ఈరోజున మీలో దేశభక్తిని పెంపొందించేందుకు మీ ఇంటిని మూడు రంగులతో అలంకరించండి. దానికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ముందుగా, సోఫా మీద ఉండే దిండ్లకు మూడురంగులు కలిగిన బట్టలను తొడగండి. కర్టెన్స్ ని, సోఫా కవర్లని మూడురంగుల వస్త్రాలతో నింపేయండి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులుండే పూల మొక్కలను ఇంటికి తీసుకురండి. చిన్నపాటి కుండల్లో వరుస క్రమంలో వాటిని నిలబెట్టండి. వీలైతే కుండలకు కూడా మూడు రంగులు వేయండి. చూడడానికి అది ఇంకా బాగుంటుంది.
పిల్లల్లో దేశభక్తి నింపేందుకు ఇదే సరైన సమయం
పిల్లల బెడ్ రూమ్ ని పూర్తిగా మార్చివేయండి. ఒక పెద్ద ఇండియా మ్యాప్ ని గోడకు అతికించండి. వాళ్ళు ఆడే వస్తువులకు జాతీయ జెండా స్టిక్కర్స్ అతికించండి. పిల్లల్లో దేశభక్తిని కలిగించడానికి ఈ పనులు ఉపయోగపడతాయి. మీ ఇంటి హాల్ ని మూడు రంగుల బెలూన్స్ తో నింపివేయండి. వాకిట్లో ముగ్గులు వేసి వాటిల్లో మూడు రంగులు నింపండి. మూడు రంగులతో చేసే అలంకరణ మాత్రమే కాదు, జాతీయ చిహ్నాలైన అశోకచక్రం, జాతీయ పక్షి, జాతీయ ఫలం, జాతీయ చెట్టు మొదలగు వాటి పోస్టర్లను ఇంటి గోడల మీద అతికించి, వాటి గురించి మీ పిల్లలకు వివరించండి. ఈ విధంగా మీ ఇంటిని మూడు రంగులతో నింపేసి రిపబ్లిక్ డేని విభిన్నంగా జరుపుకోండి.