సంక్రాంతి: పండగ విశిష్టత, ప్రాముఖ్యత, జరుపుకునే విధానాలు
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారని మనకు తెలుసు. ఈ రోజు నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభం అవుతుంది. మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథున రాశులలో ఈ కాలం ఉంటుంది. ఆ తర్వాత దక్షిణాయణం మొదలై మిగతా రాశుల్లో కొనసాగుతుంది. ఉత్తరాయణంలో పగలు ఎక్కువగా ఉంటుంది. అదే దక్షిణాయణంలో రాత్రి ఎక్కువగా ఉంటుంది. పురాణాల ప్రకారం మన దగ్గర ఒక ఉత్తరాయణం పూర్తయితే దేవతలకు ఒక పగలు పూర్తవుతుందట. అలాగే దక్షిణాయణం పూర్తయితే ఒక రాత్రి అవుతుందట. ఉత్తరాయణంలో మొదటి పండగ సంక్రాంతి. ఈరోజున ఆడపిల్లలు తెల్లవారు జామునే నిద్రలేచి వాకిట్లో ముగ్గులు వేస్తారు. అంతేకాదు పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు.
గాలి పటాలు ఎగరవేయడానికి కారణం
సంక్రాంతి రోజున దాదాపు అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలికలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేస్తారు. కొత్తబట్టలు ధరించి ఈ పండగను ఆస్వాదిస్తారు. సంక్రాంతికి పితృతర్పణాలు ఇస్తారు. సాధారణంగా ఒక సంవత్సరంలో 12సంక్రాంతులు ఉంటాయి. ప్రతి సంక్రాంతికి పితృ తర్పణాలు ఇవ్వాలి. కానీ మిగతా సంక్రాంతులకు ఇవ్వకపోయినా మకర సంక్రాంతికి ఖచ్చితంగా ఇస్తారు. గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి వాయిస్తూ వాటిచేత నృత్యాలు చేయిస్తారు. సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరవేస్తారు. దీనివెనక మంచి కారణం ఉంది. గాలిపటాలు ఎగరవేస్తే సూర్యుడు ఎండ మనమీద పడుతుంది. దానివల్ల విటమిన్ డి దొరుకుతుంది. దానివల్ల ఎముకలు బలంగా ఉంటాయి.