అందం: వేసవిలో అందాన్ని కాపాడే పండ్లతో తయారయ్యే ఫేస్ ప్యాక్స్
వేసవి వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ టైమ్ లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. అదే సమయంలో అధిక వేడి కారణంగా వచ్చే చెమట కాయలను, ఇతర చర్మ సమస్యలను దూరం చేసుకోవాలి. దానికోసం పండ్లతో తయారయ్యే ఫేస్ ప్యాక్స్ బాగా పనిచేస్తాయి. ఏయే పండ్లతో ఎలాంటి ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవాలో చూద్దాం. దోసకాయ, పుచ్చకాయ ఫేస్ ప్యాక్: ఈ రెండింటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చర్మానికి హాని చేసే పదార్థాలను బయటకు పంపించేసి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. దోసకాయ జ్యూస్, పుచ్చకాయ జ్యూస్ ని ఒకే దగ్గర కలిపి పాల పౌడర్ ని అందులో వేసి ముఖంపై ప్యాక్ వేసుకోవాలి. 30నిమిషాలయ్యక కడిగితే సరిపోతుంది.
గ్రీన్ టీ, పుదీనా, తేనె, పెరుగు చేసే మ్యాజిక్
పుదీనా, పెరుగు ప్యాక్: పుదీనా ఆకుల్ని బాగా నులిమి, అందులో పెరుగు కలిపి ముఖానికి, మెడ భాగానికి పెట్టుకోవాలి. 20నిమిషాల తర్వాత కడుక్కోవాలి. పుదీనాలోని చల్లదనం కారణంగా చర్మానికి దురద కలగదు. అలాగే చర్మం పొడిబారకుండా ఉంటుంది. గ్రీన్ టీ, తేనె ప్యాక్: గ్రీన్ టీ ఆకులను నీటిలో వేసి, ఆ నీటిని వడబోసి అందులో తేనె వేసి పేస్ట్ లాగా తయారు చేసి ముఖానికి రుద్దుకోవాలి. 20నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే చాలు. గ్రీన్ టీ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కారణంగా చర్మం ఎర్రగా మారడం, చికాకు, చర్మం ఉబ్బడం తగ్గిపోయి చర్మానికి చల్లదనం వస్తుంది. అలాగే తేనెలోని పోషకాలు చర్మానికి మంచి మేలు చేస్తాయి.