పెంపుడు కుక్కలను అర్థం చేసుకోవాలంటే వాటి నిద్రపోయే పొజిషన్ గురించి తెలుసుకోండి
పెంపుడు కుక్కపిల్లలు నిద్రపోతున్నప్పుడు వాటి పొజిషన్ ఆధారంగా దాని పరిస్థితి ఏంటన్నది అంచనా వేయవచ్చు. పాదాల మీద తలపెట్టుకుని నిద్రపోతే: ముందరి కాళ్ళ పాదాల మీద తలను పెట్టుకుని వెనక కాళ్ళను ఒక పక్కన ఉంచితే అది నిద్రపోవట్లేదని కేవలం విశ్రాంతి తీసుకుంటుందని అర్థం. చుట్టుపక్కల వచ్చే శబ్దాలను, వాసనను అది పసిగడుతూనే ఉందని, ఏదైనా అత్యవసరం వస్తే అమాంతం రంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి. పొట్టను నేలను ఆనించి నిద్రపోతే: ముందర కాళ్ళను ముందుకు చాచి, వెనక కాళ్ళను వెనక్కు చాచి పొట్టను నేలకు ఆనించి నిద్రపోతే, ఆ కుక్కపిల్ల అలసిపోయిందని, కానీ ఏదైనా ప్రమాదం వస్తే టక్కున లేవడానికి రెడీగా ఉంటుందని తెలుసుకోవాలి.
కుక్కపిల్లలు నిద్రపోయే పొజిషన్ ని బట్టి వాటి ఆలోచనలు
కాళ్ళను పక్కలకు చాచి నిద్రపోతే: ఇది చాలా సాధారణమైన పొజిషన్. మీ పెంపుడు కుక్కలు ఇలా నిద్రపోతే, అవి హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటున్నాయని, ఆ ప్రాంతంలో అవి సేఫ్ గా ఫీలవుతున్నాయని, డీప్ స్లీప్ లోకి వెళ్ళాయని అనుకోవాలి. వెల్లకిలా పడుకుని పాదాలను గాల్లోకి లేపితే: ఇలాంటి పొజిషన్లో పెంపుడు కుక్కలు నిద్రపోతే, అవి తమ యజమానులను, తామున్న ప్రాంతాన్ని బాగా నమ్ముతున్నాయని అర్థం. ఈ పొజిషన్లో అవి చాలా ప్రశాంతంగా ఫీలవుతాయి. కాళ్ళను ముడుచుకుని ఒక బంతిలాగా నిద్రపోతే: నాలుగు కాళ్ళను ముడుచుకుని ఒక బంతి మాదిరిగా మీ పెంపుడు కుక్కలు నిద్రపోతే, అవి తమను తాము రక్షించుకున్నట్టుగా అనుకోవాలి. సాధారణంగా చలికాలంలో తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ఇలా నిద్రపోతాయి.