Raksha Bandhan: ఏ దేవతలు.. ఏ దేవుళ్లకు రాఖీ కట్టారు?
ఈ వార్తాకథనం ఏంటి
రాఖీ.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అక్క పక్కన తమ్ముడు, చెల్లి పక్కన అన్న ఉంటే ఆ భరోసానే వేరు. కంటికి రెప్పలా కాపాడుకుంటాడనే నమ్మకం సోదరిపై ఉంటుంది. అందుకే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమకు ప్రతిరూపంగా రక్షాబంధన్‌ను జరుపుకుంటారు. సోదరి తన సోదరుడి మణికట్టుకు ప్రేమగా రాఖీ కట్టి, అతని క్షేమాన్ని కోరుకుంటుంది. సోదరుడు కూడా ఆమెకు బహుమతి ఇచ్చి.. జీవితాంతం అండగా ఉంటానని మాట ఇస్తాడు. అయితే రక్షాబంధన్ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికే పరిమితం కాలేదు. ఈ పండుగ వెనుక ఎన్నో పౌరాణిక కథలు, ఆసక్తికరమైన ఇతిహాసాలు ఉన్నాయి. దేవతలు, దేవుళ్లకు రాఖీ కట్టిన కథనాలు కూడా పురాణాల్లో కనిపిస్తాయి. ఇంతకీ ఎవరెవరికి రాఖీ కట్టారు? ఆ కథలేంటో తెలుసుకుందాం.
వివరాలు
శ్రీకృష్ణుడికి.. ద్రౌపది
మహాభారతంలో శ్రీకృష్ణుడు లేని ఘట్టాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. పాండవులకు రక్షణ కవచంలా నిలిచిన శ్రీకృష్ణుడు.. ద్రౌపదికి తోబుట్టువు కాకపోయినా ఆమెకు ఎప్పుడూ అండగా నిలిచాడు.
ముఖ్యంగా నిండు సభలో ద్రౌపది మానప్రాణాలను కాపాడిన దేవుడిగా శ్రీకృష్ణుడిని కొలుస్తారు.
దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. దుష్టశిక్షణ కోసం అవతరించిన శ్రీకృష్ణుడు.. దుర్మార్గాలకు పాల్పడుతున్న ఛేది రాజ్య చక్రవర్తి శిశుపాలుడిని సంహరించాలని నిర్ణయించుకుంటాడు.
శిశుపాలుడు కృష్ణుడి మేనత్త శ్రుతాదేవి కుమారుడు. అయినప్పటికీ ధర్మాన్ని కాపాడేందుకు, దుష్టశక్తిని అణచివేసేందుకు సొంత బంధువునే సంహరించడానికి కృష్ణుడు వెనుకాడడు.
అయితే తన మేనత్తకు ఇచ్చిన మాట ప్రకారం శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యే వరకు కృష్ణుడు వేచి చూస్తాడు.
ఆతర్వాత సుదర్శన చక్రంతో శిశుపాలుడిని సంహరిస్తాడు.
వివరాలు
ఆ ఘట్టాలను రక్షాబంధన్‌కు మూలం
శిశుపాలుడిని సంహరించే సమయంలో శ్రీకృష్ణుడి చేతికి గాయం అవుతుంది. అది చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టుకడుతుంది.
ద్రౌపది తనను అన్నగా భావించి ఆపదలో ఆదుకుందని సంతోషించిన శ్రీకృష్ణుడు.. ఆమెకు అభయం ఇస్తాడు.
ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చినా తనను తలుచుకోవాలని, అండగా ఉంటానని మాట ఇస్తాడు.
ఈ సంఘటనే రక్షాబంధన్‌కు నాందిగా నిలిచిందని పురాణ కథనాలు చెబుతున్నాయి.
తోబుట్టువులు కాకపోయినా ద్రౌపది కృష్ణుడిని అన్నగా భావించి రాఖీ కట్టడం.. చెల్లెలిగా భావించిన ద్రౌపదిని శ్రీకృష్ణుడు కాపాడటం వంటి ఘట్టాలను రక్షాబంధన్‌కు మూలంగా చెబుతారు.
వివరాలు
బలి చక్రవర్తికి.. లక్ష్మీదేవి
మహా పరాక్రమశాలి, దానగుణానికి మారుపేరుగా నిలిచిన బలి చక్రవర్తికి సాక్షాత్తు మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి రక్షాబంధన్ కట్టిన కథ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
ఒక సందర్భంలో రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమిస్తాడు.
దానవుల నుంచి మానవులను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని విడిచి వామనుడి రూపంలో భూమిపైకి వస్తాడు.
ఈ సమయంలో తన భర్తను తిరిగి వైకుంఠానికి తీసుకెళ్లాలని భావించిన లక్ష్మీదేవి.. ఓ బ్రాహ్మణ యువతి రూపంలో బలి చక్రవర్తి వద్దకు వెళ్తుంది.
శ్రావణ పౌర్ణమి రోజున బలి చక్రవర్తి చేతికి పవిత్రమైన రక్షాదారాన్ని కడుతుంది.
ఆతర్వాత తానెవరో, తనకు ఉన్న కోరిక ఏమిటో అతనికి చెబుతుంది. తన భర్త విష్ణుమూర్తిని తిరిగి వైకుంఠానికి పంపించాలని బలి చక్రవర్తిని కోరుతుంది.