కంటికురుపు ఎందుకు వస్తుంది? రాకుండా నిరోధించే మార్గాలు తెలుసుకోండి
కనురెప్ప మీద చిన్నపాటి మొటిమ మాదిరిగా ఏర్పడటాన్ని కంటికురుపు అంటారు. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఈ కంటి కురుపు కొన్నిసార్లు కనురెప్ప లోపలి భాగంలో కూడా అవుతుంది. అసలు కంటికురుపు ఎందుకవుతుంది? దీని ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కంటికురుపు అన్ని వయసుల వారిలో ఏర్పడుతుంది. ఇది ఏర్పడడానికి గల ముఖ్య కారణం, రెప్ప వెంట్రుక కుదుళ్లలో ఉండే గ్రంధుల నుండి ఉత్పత్తి అయ్యే ఆయిల్ కి అడ్డంకులు ఏర్పడటమే. అందం కోసం ఉపయోగించే కాస్మెటిక్స్ వల్ల ఆయిల్ ఉత్పత్తికి అడ్డంకి ఏర్పడుతుంది. మురికి చేతులతో కళ్ళను ముట్టుకోవడం, అలాగే శుభ్రంగా లేని కాంటాక్ట్ లెన్స్ వాడటం వల్ల కూడా కంటికురుపు ఏర్పడుతుంది.
కంటికురుపు లక్షణాలు, దాన్ని పోగొట్టే విధానాలు
కంటికురుపు వల్ల కనురెప్ప భాగంలో దురదగా ఉంటుంది. కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటాయి. కొన్నిసార్లు నొప్పిగా ఉంటుంది. కనురెప్ప తెరవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలి? కాటన్ వస్త్రాన్ని వెచ్చగా చేసి కంటిమీద ఉంచుకోవాలి. రోజుకు 10 నుండి 15సార్లు చేస్తే సరిపోతుంది. గోరువెచ్చని నీటితో కళ్ళను కడిగితే కూడా కంటికురుపు తగ్గిపోతుంది. లేదంటే ఫార్మసీలో దొరికే కళ్ళమందును కంట్లో వేసుకుంటే ఉపశమనం దొరుకుతుంది. కంటికురుపు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మురికిగా ఉన్న చేతులతో కళ్ళను ముట్టుకోవద్దు. రాత్రి పడుకునే ముందు ముఖానికి వేసుకున్న మేకప్ ని పూర్తిగా తీసివేయాలి. కాస్మెటిక్స్ వాడే ముందు వాటి ఎక్స్ పైరీ తేదీ చూసుకోవాలి. కాంటాక్ట్ లెన్స్ క్లీన్ గా ఉంచుకోవాలి.