Bonalu 2026: ఆనంద సిరుల బోనాలు.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఆషాఢ బోనాల వైభవం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకృతిని ప్రత్యక్ష దైవస్వరూపంగా భావించి ఆరాధించడం భారతీయ సంప్రదాయంలో భాగం. ప్రకృతి రూపాలైన జగన్మాతను పూజించేందుకు ఆషాఢమాసాన్ని అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. వర్షాకాలంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ తెలంగాణలో ఆషాఢ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. దేవీ భాగవతం ప్రకారం ఆదిశక్తి నుంచి వెలువడిన రూపాలే గ్రామదేవతలు. వ్యవసాయం, శ్రమ ఆధారంగా జీవించే రైతులు, కార్మికులు మాతృశక్తిని వివిధ పేర్లతో, తమ జానపద సంప్రదాయాల ప్రకారం ఆరాధిస్తుంటారు.
వివరాలు
ఆదిశక్తి వైభవానికి ప్రతీకగా వేడుక..
దేవి మహాతంత్రం ప్రకారం ఆషాఢమాసం ఆదిశక్తి వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది.
అలాగే కాళికా పురాణం ప్రకారం సప్తమాతృకలు, దశమహావిద్యలు ఈ నెలలో మరింత శక్తివంతంగా వెలుగొందుతూ భక్తులకు వరాలు ప్రసాదిస్తాయని పేర్కొంది.
ఆషాఢమాసంలో ప్రకృతిపరంగా ఎదురయ్యే ఇబ్బందులను దైవశక్తితో అధిగమించేందుకు ప్రత్యేక అర్చనలు నిర్వహించే సంప్రదాయం ఉందని పండితారాధ్య చరిత్ర చెబుతోంది.
మణిమకుట మంజరి ప్రకారం ఈ నెలలో త్రిశక్తులను ఇంద్రాణీ దేవిగా ఏకరూపంగా ఆరాధించాలని సూచించారు.
ఆషాఢమాసానికి అధిదేవత చండీమాత కావడంతో దీనిని చండికామాసం అని కూడా పిలుస్తారు.
కాకతీయులు తమ ఆరాధ్యదేవత అయిన కాకతిని పూజిస్తూ ఆషాఢ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేవారు.
ఆలయాల ముందు అన్నాన్ని రాశిగా పోసి దేవీ స్వరూపాలకు నివేదించే ఆచారం అప్పట్లో ఉండేది.
వివరాలు
అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం..
భగవద్గీతలో జీవులకు పోషణనిచ్చే భోజనాన్ని యజ్ఞద్రవ్యంగా పేర్కొన్నారు.
ప్రాణాధారమైన అన్నాన్ని బోనంగా సమర్పించడం ద్వారా ప్రకృతి శక్తుల పట్ల భక్తి, కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. జానపద భాషలో భోజనమే బోనంగా రూపాంతరం చెందింది.
"మీ అనుగ్రహంతో లభించిన ఈ అన్నాన్ని బోనంగా సమర్పిస్తున్నాం. మా కుటుంబాలను, సమాజాన్ని ఎల్లప్పుడూ కాపాడండి" అనే వినయపూర్వక ప్రార్థనే ఆషాఢ బోనాల వెనుక ఉన్న భావం.
జంట నగరాల్లో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాల్లో బోనాల పండుగ ఒకటి.
ముందుగా గోల్కొండ జగదాంబ ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
అనంతరం బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా సింహవాహిని మాత మహేశ్వరి, అక్కన్న-మాదన్న మహంకాళి ఆలయాల్లో బోనాల జాతర ఘనంగా కొనసాగుతుంది.
వివరాలు
ఘటోత్సవంతో ప్రారంభమయ్యే బోనాల జాతర..
1864లో ఉజ్జయినిలో సైన్యంలో పనిచేసిన సురిటి అప్పయ్య అనే భక్తుడు సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బోనాల సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లు చెబుతారు.
ఘటోత్సవంతో ప్రారంభమయ్యే బోనాల జాతర సాగనంపుతో ముగుస్తుంది.
బోనం సమర్పించే పాత్ర మన శరీరానికి ప్రతీకగా భావిస్తారు. అందులోని అన్నం ప్రాణశక్తిని సూచిస్తుంది.
బోనం పై వెలిగించే దీపం ఆత్మజ్యోతికి సంకేతం. ఆ ఆత్మజ్యోతిని పరంజ్యోతితో అనుసంధానం చేసి, అజ్ఞానం నుంచి జ్ఞాన వెలుగువైపు ప్రయాణించడమే బోనాల పండుగలోని అంతరార్థమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.