Hyderabad Bonalu 2026: బోనం అంటే ఏమిటి? వందల ఏళ్ల చరిత్ర కలిగిన బోనాల పండుగ విశిష్టత ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్ జంట నగరాలు బోనాల సంబురాలతో కళకళలాడుతాయి. సంప్రదాయం, భక్తి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ నెల రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ప్రతి ఏడాది గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది జూలై 16న తొలి బోనం సమర్పించనుండగా, అప్పటి నుంచి నగరమంతా పండుగ వాతావరణం నెలకొననుంది. ఒకప్పుడు తెలంగాణలోని దాదాపు ప్రతి గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించేవారు. ఈ సంప్రదాయానికి ఉన్న విశిష్టతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ప్రతి ఏడాది అధికారికంగా నిర్వహిస్తోంది.
వివరాలు
జగదాంబిక మహంకాళి ఆలయంలో బంగారు బోనం..
తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో బంగారు బోనం సమర్పించి ఉత్సవాలను ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఈ ఏడాది జూలై 16 నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానుండగా, అనంతరం జూలై 20, 21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు.
తెలంగాణసంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాన్ని మహిళలే సిద్ధం చేస్తారు.
బోనాల సందర్భంగా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ గ్రామదేవతలకు పసుపు, కుంకుమ, చీరసారెలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు.
వివరాలు
తొలి బోనం ఎవరికి సమర్పిస్తారంటే?
కుటుంబం సుఖశాంతులతో ఉండాలని, ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని అమ్మవారిని ప్రార్థిస్తారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా బోనాల పండుగను జరుపుకుంటారు.
బోనాల పండుగకు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉందని చెబుతారు.
కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పెద్దలు చెబుతుంటారు.
అనంతరం పాలించిన ముస్లిం నవాబులు కూడా ఈ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు చెబుతారు.
హైదరాబాద్‌లోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయం అత్యంత పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
అందుకే ఇక్కడే తొలిబోనం సమర్పిస్తారు. రెండోబోనం బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మఆలయంలో, మూడోబోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు.
వివరాలు
ప్లేగు వ్యాధితో వేలాది మంది మృతి..
బోనం అంటే అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసే నైవేద్యం. దీనిని మట్టి లేదా రాగి కుండలో వండి గ్రామదేవతకు సమర్పిస్తారు.
అనంతరం బోనం కుండను వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరించి, దానిపై దీపం వెలిగిస్తారు.
మహిళలు ఈ బోనాన్ని నెత్తిపై మోసుకుంటూ డప్పులు, మేళతాళాల నడుమ ఆలయాలకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు.
గ్రామాల్లో ఈ వేడుకను "ఊర పండుగ"గా కూడా పిలుస్తారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది.
బ్రిటీష్ పాలనలో సురటి అప్పయ్య అనే వ్యక్తి 1813లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ అయ్యారు.
అదే సమయంలో హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి విజృంభించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
లష్కర్ బోనాలు ఎప్పుడంటే?
ఈ విషయం తెలుసుకున్న ఆయన ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రార్థిస్తూ, వ్యాధి తగ్గితే హైదరాబాద్‌లో అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నారని చెబుతారు.
అనంతరం వ్యాధి తగ్గిపోవడంతో 1815లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయించారు.
అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఇక్కడ బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈసారి ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో లష్కర్ బోనాల సమర్పణ జరగనుంది.
వివరాలు
నెల రోజుల పాటూ సాగే బోనాలు..
ఆగస్టు 3న బోనాల జాతరలో అత్యంత విశిష్టమైన 'రంగం' కార్యక్రమం నిర్వహిస్తారు.
ఇందులో ఓ మహిళ మట్టికుండపై నిలబడి భవిష్యవాణి చెబుతుంది.
అనంతరం ఆగస్టు 9న పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
అదే సమయంలో భాగ్యనగరంలోని ప్రధాన దేవాలయాల్లో కూడా ఉత్సవాలు పరాకాష్టకు చేరుకుంటాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
చివరిగా ఆగస్టు 10న అమ్మవారి విగ్రహాన్ని ఏనుగుపై ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు.
దీంతో నెల రోజుల పాటు సాగిన బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.