తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు
దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన కర్ణాటక మహారాజు. అయినా కూడా తెలుగు భాష గురించి గొప్పగా పొగిడారంటే తెలుగు భాష గొప్పదనం అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణ దేవరాయలు మాత్రమే కాదు నోబెల్ గ్రహీత రవీంద్ర నాథ్ ఠాగూర్, ప్రఖ్యాత తమిళ కవి సుబ్రమణ్య భారతి తెలుగు భాషను సుందర తెలుగు అని కొనియాడారు. తెలుగు భాషలోని ప్రతీ పదానికి ఒకరకమైన శబ్దం ఉంటుంది. ఆ శబ్దాలతో తెలుగు పదాలు వినడానికి శ్రావ్యంగా ఉంటాయి. అందుకే సంగీతానికి అనువైన భాషగా తెలుగు భాషను చెప్పుకుంటారు. నేడు తెలుగు భాషా దినోత్సవం. ఈ సందర్భంగా అమ్మ భాష గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం.
అచ్చుతో పూర్తయ్యే భాష
తెలుగు భాషలోని ప్రతీ పదం అచ్చు శబ్దంతో పూర్తవుతుంది. తూర్పు దేశాల్లో కేవలం తెలుగు భాషకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. పశ్చిమ దేశాల్లో ఇటలీకి చెందిన ఇటాలియన్ భాష కూడా అచ్చు శబ్దంతో పూర్తవుతుంది. పశ్చిమ దేశాల నుండి వచ్చిన అప్పటి పర్యాటకులు తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచారు. ప్రపంచంలోని రెండవ అందమైన లిపి కలిగిన భాష: ప్రపంచ భాషలన్నింటిలోకి అందమైన లిపి కలిగిన భాషగా మొదటి స్థానం కొరియన్ భాషకు దక్కితే రెండవ స్థానం తెలుగు భాషకు దక్కింది. సామెతలు ఎక్కువగా ఉన్న భాష: తెలుగు భాషలో లెక్కలేనన్ని ప్రక్రియలున్నాయి. అందులో సామెతలు ఒకటి. ఏదైనా ఒక సందర్భాన్ని సామెతల రూపంలో సులభంగా చెప్పవచ్చు.
ప్రాచీన భాష
2వేల సంవత్సరాల పూర్వం నుండే తెలుగు భాష అందుబాటులో ఉంది. అందుకే తెలుగుకు ప్రాచీన భాష హోదా దక్కింది. మయన్మార్ లో తెలుగు పేరుతో వీధులు: మయన్మార్ దేశంలో తెలుగు వారు ఎక్కువగా కనిపిస్తారు. అక్కడ మల్లెపూల దిబ్బ పేరుతో తెలుగు వీధి కూడా ఉంది. అత్యంత ఎక్కువ సాహిత్య సంపద కలిగిన భాష: తెలుగులో సాహిత్య సంపద చాలా ఎక్కువ. ఆదికవి నన్నయ్య మొదలు ఎందరో మహాకవులు తెలుగు భాషలో రచనలు చేసారు. తెలుగు భాషలో యాసలు: తెలుగు భాష ఒక్కటే అయినా ప్రాంతాన్ని బట్టి రకరకాల యాసలు తెలుగులో కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒకరకమైన యాస కనిపిస్తూ ఉంటుంది.