Holi colours: హోలీ రంగుల్లో దాగిన సందేశం.. ప్రతి రంగుకు ప్రత్యేక అర్థం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
'కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉంది రా..' అంటూ అక్కినేని నాగార్జున నటించిన ఒక తెలుగు సినిమాలో వినిపించిన ఈ పాట హోలీ ఉత్సాహాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఏడాది మార్చి 14 (శుక్రవారం) హోలీ పండుగ జరుపుకోనున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ, ఆనందంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. అయితే హోలీలో ఉపయోగించే ప్రతి రంగుకీ ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఆ రంగుల వెనుక ఉన్న అంతర్యం ఏమిటో చూద్దాం.
Details
ఆకుపచ్చ (Green)
హోలీ వేడుకల్లో ముఖ్యమైన రంగుల్లో ఆకుపచ్చ ఒకటి. ఇది మనశ్శాంతి, అభివృద్ధి, కొత్త ప్రారంభాలకు ప్రతీక. గతంలో మనస్పర్థలు వచ్చిన వారితో మళ్లీ స్నేహబంధం పునరుద్ధరించాలనుకునే వారు ఈ రంగును ఉపయోగిస్తారు. కొత్త సంబంధాలకు శ్రీకారం చుట్టే సందర్భాల్లో కూడా ఆకుపచ్చకు ప్రాధాన్యం ఇస్తారు. ఎరుపు (Red) హిందూ సంప్రదాయంలో ఎరుపు రంగుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనికి అపారమైన శక్తి ఉందని నమ్మకం. హోలీ సందర్భంలో ఎరుపు ప్రేమ, వివాహ బంధానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా ప్రేమజంటలు, భాగస్వాములు ఒకరిపై ఒకరు ఈ రంగు చల్లుకోవడం ఆనవాయితీ.
Details
గులాబీ (Pink)
హోలీలో ఎక్కువగా కనిపించే రంగుల్లో గులాబీ ముందుంటుంది. అందం, ఆప్యాయత, విశ్వాసాన్ని సూచించే ఈ రంగు స్నేహితులు, బంధువులతో ఉన్న అనుబంధాన్ని బలపరచేందుకు వినియోగిస్తారు. పసుపు (Yellow) ఎరుపు తర్వాత హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రంగు పసుపు. ఇది శ్రీ మహావిష్ణువుకు ప్రతీకగా భావిస్తారు. ప్రియమైన వారు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పసుపు రంగును చల్లుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే రంగుగానూ దీనిని భావిస్తారు. ఆరెంజ్ (Orange) నారింజ రంగులో సూర్యదేవుని శక్తి నిక్షిప్తమై ఉందని విశ్వాసం. కొత్త పనులకు శ్రీకారం చుట్టే సమయంలో, అలాగే క్షమాగుణానికి ప్రతీకగా ఈ రంగును ఉపయోగిస్తారు.
Details
సహాజ పదార్థాలతో రంగులు తయారు చేసుకోవాలి
అయితే హోలీ అంటే కేవలం సంబరమే కాదు, జాగ్రత్త కూడా అవసరం. మార్కెట్‌లో లభించే రంగులు ఎక్కువగా రసాయనాలతో తయారు అవుతాయి. ఇవి చర్మం, కళ్లకు హానికరంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే సహజ పదార్థాలతో రంగులు తయారు చేసుకుని హోలీ ఆడుకోవడం ఆరోగ్యానికి మేలుకలిగిస్తుంది. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.