
Motivational: ఓ రాయి కథ.. జీవితంలో విజయం కావాలా? ఇలా ఆలోచించడం నేర్చుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
ఒకరోజు ఒక శిల్పి అడవిలో నడుస్తూ వెళ్తున్నాడు. అప్పుడు అతనికి ఒక అందమైన, మచ్చలేని రాయి కనబడింది. ఆ రాయిని చూసిన శిల్పికి ఒక వినాయక విగ్రహాన్ని చెక్కాలనిపించింది. వెంటనే తన పనిముట్లు తీసుకుని చెక్కడానికి సిద్ధమయినప్పుడు, ఆ రాయి మాట్లాడింది. దయచేసి నన్ను గాయపరచకండి. నా పైన కొడితే నేను తట్టుకోలేను. మీరు కావాలనుకుంటే వేరే రాయిని వెతకండి అని రాయి కోరింది. అది విన్న శిల్పి అక్కడినుండి వెళ్లిపోయాడు. కొంతదూరం నడిచిన తరువాత శిల్పికి మరో రాయి కనబడింది. ఇప్పుడు అతను అదే పనిముట్టుతో ఈ రాయిని చెక్కడం ప్రారంభించాడు. రాయికి నొప్పిగా ఉన్నా అది ఓర్పుతో భరించింది.
Details
రాయిని విగ్రహాంగా మార్చిన శిల్పి
కొన్ని గంటల తర్వాత శిల్పి ఆ రాయిని ఒక అందమైన వినాయక విగ్రహంగా మలిచాడు. తర్వాత ఆ విగ్రహాన్ని గ్రామానికి తీసుకెళ్లి గుడిలో ప్రతిష్టించారు. గ్రామస్థులు ప్రతిరోజూ విగ్రహానికి పూజలు చేయసాగారు. సాధువులు, భక్తులు వచ్చి నమస్కరించారు. కొబ్బరికాయలు కొట్టి వినాయకుడిని రఅర్చించడం ప్రారంభించారు.కానీ కొబ్బరికాయలు కొట్టే శబ్దం విగ్రహానికి తగలకుండా ఉండాలనే ఉద్దేశంతో వినాయక విగ్రహం ముందు ఒక గుండ్రటి రాయిని ఉంచారు. అది శిల్పి మొదట చూసిన రాయే! ఇప్పుడు ప్రతిరోజూ వందల కొబ్బరికాయల దెబ్బలు ఆ రాయిపైనే పడుతున్నాయి. ఆ సమయంలో ఆ రాయి మౌనంగా ఇలా అనుకుంది: "ఆ రోజు నేను శిల్పిని అనుమతించి ఉంటే, ఇప్పుడు ఈ నిస్సారమైన కొబ్బరికాయల దెబ్బలు తినాల్సిన పరిస్థితి రాకపోయేది."
Details
కథ సారాంశం ఇదే
ఇలాంటి పరిస్థితి మన జీవితంలో కూడా తారసపడుతుంది. చిన్న కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోకుండా, తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటాము. కానీ నిజానికి, ఆ కష్టాలే మనిషిని మానవుడిగా మలుస్తాయి. ఒకవేళ మీరు ఇప్పుడు ఎదురవుతున్న కష్టాలను ఓర్పుతో భరించడం నేర్చుకుంటే, భవిష్యత్తులో అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదగగలుగుతారు. ఈ కథలోని రెండో రాయి మాదిరిగా, జీవితాంతం గౌరవాన్ని పొందే అవకాశం మీకూ ఉంటుంది. కష్టాన్ని తప్పించుకోవడమే కాదు, దాన్ని ఎదుర్కోనే తత్వమే మనల్ని విజయానికి చేర్చుతుంది. కాబట్టి, జీవితంలో కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యంగా స్వీకరించడం నేర్చుకోండి. ఒక్కసారి శ్రమను తట్టుకుని ముందుకు సాగినవారే జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు.