
అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు జాబితాలో సింగపూర్ ఫస్ట్; మరి భారత్ స్థానం ఎంతంటే!
ఈ వార్తాకథనం ఏంటి
Henley passport index 2023: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు జాబితాను 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023' విడుదల చేసింది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో ఈ ఏడాది సింగపూర్ ప్రథమ స్థానంలో నిలిచింది.
సింగపూర్ పాస్‌పోర్ట్ ఉంటే, 192 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించొచ్చని హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ చెబుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా 227 ప్రయాణ గమ్యస్థానాలు ఉంటే, 192 ప్రదేశాలకు కేవలం ఒక్క సింగపూర్ వీసాతో వెళ్లొచ్చు అంటే, అది ఎంత శక్తమంతమైనదో అర్థమవుతుంది.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకులను నిర్ణయిస్తారు.
పాస్‌పోర్టు
రెండోస్థానంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్
సింగపూర్ తర్వాత మూడు యూరోపియన్ దేశాలు జర్మనీ, ఇటలీ, స్పెయిన్ రెండోస్థానాన్ని పంచుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టు ఉంటే, 190 ప్రదేశాలకు వీసా రహిత ప్రయాణం చేయొచ్చు.
అదే సమయంలో గత ఐదేళ్లలో తొలిసారిగా జపాన్ మొదటిస్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. ఇప్పుడు జపాన్ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా చేరుకోగల గమ్యస్థానాల సంఖ్య 189కి తగ్గింది.
యూకే ఈసారి రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకు చేరుకుంది.
దాదాపు పదేళ్ల క్రితం ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా, ఈసారి రెండు స్థానాలు దిగజారి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. అమెరికా పాస్‌పోర్ట్‌తో ఉంటే, 184 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రయాణం చేయొచ్చు.
భారత్
జాబితాలో భారత్‌కు 80వ ర్యాంకు
ఈ సారి హెన్లీ నివేదికలో భారత్ ర్యాంకింగ్ పెరిగింది.
భారత్ ర్యాంక్ 87 నుంచి 80కి ఎగబాకింది. భారత్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 57దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. ఈ జాబితాలో శ్రీలంక, థాయ్ లాండ్, జమైకా వంటి దేశాలు ఉన్నాయి.
చైనా ర్యాంకింగ్‌లో కూడా అద్భుతమైన మెరుగుదల కనిపించింది. గతంలో చైనా 80వ స్థానంలో ఉండగా, 2023 నివేదికలో 68వ స్థానానికి ఎగబాకింది.
ఈ ర్యాంకింగ్‌లో పొరుగు దేశం పాకిస్థాన్ 100వ స్థానంలో ఉంది.
తాలిబాన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్థాన్ అట్టడుగున ఉంది.