వినాయక చవితి: పండగ సాంప్రదాయాలు, సంబరాలు, తెలుసుకోవాల్సిన విషయాలు
వినాయక చవితి పండగ రోజున వినాయకుడిని పూజిస్తారు. ఈ పండగ 11రోజులు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 9రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 18వ తేదీన పండగ జరుపుకోవాలని నిర్ణయించారు. మొదటిరోజు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. 16దశల్లో(షోడశ ఉపచారాల్లో) దేవుడిని పూజిస్తారు. పూలు, పండ్లు, నైవేద్యము నీళ్లు ఇలా 16దశల్లో గణేశుడిని పూజిస్తారు. గణేశుని నిమజ్జనం కోసం కదిలించే రోజున ఉత్తర పూజ చేస్తారు. ఈ రోజున గణేశుడికి వీడ్కోలు అందించి శోభాయాత్రకు సిద్ధం చేస్తారు. ఆ తర్వాత చెరువులో గానీ నదిలో గాని సముద్రంలో గానీ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. ఇలా 11రోజులపాటు పండగ సాగుతుంది.
వినాయక చవితి పండగ సాంప్రదాయాలు
వినాయక చవితి కంటే రెండు రోజుల ముందు నుంచి ఇల్లు, పరిసరాలు శుభ్రం చేసుకుంటారు. వస్త్రాలు అన్నింటిని శుభ్రంగా ఉతికి ఆరవేస్తారు. పండగ రోజున ఇండ్లలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆ విగ్రహాలను వీధుల్లోని గణేష్ మండపాల దగ్గర ఉంచుతారు. గణేష్ నవరాత్రుల సమయంలో చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. అది కూడా సాత్వికాహారాన్ని తింటారు. గణేష్ నిమజ్జనం కోసం సాగే శోభాయాత్ర తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం వేడుకలకు వేలాదిమంది భక్తులు తరలి వస్తారు.