Diet Trends: బరువు తగ్గాలనుకుంటున్నారా? నిపుణులు సూచిస్తున్న డైట్ టిప్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
శారీరకంగా ఫిట్‌గా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రతిరోజూ వ్యాయామానికి సమయం కేటాయించలేని వారు కూడా డైట్ ద్వారా బరువును నియంత్రించుకునే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం చాలా మంది ఆహార నియంత్రణపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. బరువు పెరగకుండా మితంగా, సరైన ఆహారం తీసుకోవడమే డైట్ ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కీటో, మెడిటరేనియన్, ప్లాంట్ బేస్డ్ వంటి అనేక డైట్ ట్రెండ్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరి, ఏ డైట్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
Details
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్
ఈ డైట్‌లో ఆహారం కంటే సమయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సాధారణంగా 16:8లేదా 20:4పద్ధతులను అనుసరిస్తారు. అంటే 16 గంటలు లేదా 20 గంటలు పూర్తిగా ఉపవాసం ఉండి, ఆ తర్వాత మిగిలిన 8 గంటలు లేదా 4 గంటల సమయంలో భోజనం చేస్తారు. ఈ విధానంలో కేలరీల లెక్కలు చూసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆకలిని నియంత్రించడంతో పాటు బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. శరీర మెటబాలిజం కూడా మెరుగవుతుంది. అయితే, గర్భిణులు, వృద్ధులు, డయాబెటిస్ ఉన్నవారికి ఈ డైట్ సరిపోదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 'The Nutrition Source' అధ్యయనం ప్రకారం, ఈ డైట్ పాటిస్తే 10 వారాల్లో 7 నుంచి 11పౌండ్ల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది.
Details
కీటోజెనిక్ డైట్
ఈ డైట్‌లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. సాధారణంగా శరీరం కార్బోహైడ్రేట్ల ద్వారా శక్తిని పొందుతుంది. కానీ, కీటో డైట్‌లో కార్బ్స్ తగ్గించడం వల్ల శరీరం నిల్వగా ఉన్న కొవ్వును కరిగించి శక్తిగా వినియోగించుకుంటుంది. దీంతో బరువు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయట. ఈ డైట్‌లో బ్రెడ్, స్వీట్స్, బంగాళదుంపలు, బియ్యం, గోధుమలు వంటి అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. డ్రై ఫ్రూట్స్, పాలకూర, క్యాబేజీ, గుడ్లు, మాంసాహారం వంటివి తీసుకోవచ్చు.
Details
మెడిటరేనియన్ డైట్
గ్రీస్, ఇటలీ, స్పెయిన్ వంటి మధ్యధరా సముద్ర తీర దేశాల ప్రజల ఆహార అలవాట్లే ఈ డైట్‌కు ఆధారం. ఇందులో తీపి పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్, డీప్‌ఫ్రై వంటకాలను పూర్తిగా నివారిస్తారు. తాజా పండ్లు, పచ్చి కూరగాయలు, చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, ఆలివ్ నూనెతో చేసిన వంటకాలు మాత్రమే తీసుకుంటారు. ఇది బరువు తగ్గడానికే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 'ucdavis.edu' అధ్యయనం ప్రకారం, ఈ డైట్‌ను పాటించే వారిలో కాలక్రమేణా బరువు పెరుగుదల తక్కువగా ఉంటుందట. ఊబకాయం వచ్చే అవకాశాన్ని ఇది తగ్గిస్తుంది.
Details
ప్లాంట్ బేస్డ్ డైట్
ఈ డైట్‌ను పాటించే వారు పాలు, గుడ్లు, మాంసం వంటి జంతు ఉత్పత్తులను పూర్తిగా మానేసి మొక్కల నుంచి వచ్చే ఆహారంపైనే ఆధారపడతారు. తాజా పండ్లు, ఆకుకూరలు, పచ్చి కూరగాయలు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉంటారు. దీని వల్ల సహజంగా బరువు తగ్గడమే కాకుండా మెదడు చురుగ్గా మారుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అయితే, ఐరన్, ప్రొటీన్, విటమిన్ B12 సరిపడా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ డైట్ ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు పర్యావరణహితంగా కూడా ఉంటుంది.
Details
స్మూతీ డైట్
ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన డైట్ ఇది. భోజనానికి బదులుగా ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే స్మూతీలను తీసుకుంటారు. పండ్లు, కూరగాయలు, ఓట్స్, విత్తనాలు, పప్పు వంటి పదార్థాలతో వీటిని తయారు చేస్తారు. భోజనం చేయడానికి సమయం లేని వారు ఈ డైట్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ విధానం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
Details
లోకల్, ఆర్గానిక్ డైట్
స్థానికంగా లభించే, రసాయనాలు ఉపయోగించకుండా పండించిన ఆహారాన్ని తీసుకోవడమే ఈ డైట్ ప్రత్యేకత. ఇందులో ప్రత్యేకమైన నిబంధనలు ఉండవు. కానీ, తాజాగా పండిన, పోషకాలు మెండుగా ఉన్న ఆర్గానిక్ ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అయితే, ఈ ఆహారం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. రా ఫుడ్ డైట్ ఆహారాన్ని ఉడకబెట్టడం వల్ల పోషకాలు నశిస్తాయనే భావనతో కొందరు పూర్తిగా పచ్చి కూరగాయలు, తాజా పండ్లను మాత్రమే తీసుకుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్‌కు, అలాగే 48 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేసిన ఆహారాలకు దూరంగా ఉంటారు. ఈ డైట్ వల్ల బరువు తగ్గడమే కాకుండా జీర్ణక్రియ మెరుగవుతుంది. దీని ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని భావిస్తున్నారు.
Details
డిజిటల్ డైట్
ఇవన్నీ సాధ్యం కానివారు డిజిటల్ డైట్‌ను అనుసరిస్తున్నారు. తాము తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి, ఎలాంటి పోషకాలు ఉన్నాయన్న విషయాన్ని ముందుగానే తెలుసుకుంటున్నారు. ఇందుకోసం మొబైల్ యాప్స్, ఇతర డిజిటల్ పరికరాలను వినియోగిస్తున్నారు. ఆహారాన్ని స్కాన్ చేస్తే చాలు, కేలరీలు, పోషక విలువల వివరాలు అందుతాయి. వాటి ఆధారంగా ఆహారాన్ని నియంత్రించుకుంటున్నారు.