How to Book Ticket in IRCTC :ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే 'వికల్ప్' సరైన మార్గం..
ఈ వార్తాకథనం ఏంటి
పండుగలు,దీర్ఘ సెలవుల సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు చాలా మందికి "వెయిటింగ్ లిస్ట్", "RAC" వంటి పదాలు ఎదురవుతుంటాయి. బెర్త్ కన్ఫర్మేషన్ కోసం రైలు బయల్దేరే ముందు చార్ట్ తయారయ్యే వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వేళల్లో బెర్త్ ఖచ్చితంగా దొరికే అవకాశాలు పెంచుకోవాలంటే "వికల్ప్" సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. టికెట్ బుకింగ్ సమయంలో ఈ ఎంపికను తీసుకుంటే, ఒకే మార్గంలో వెళ్లే ఇతర రైళ్లలో ఖాళీ బెర్త్‌లు ఉంటే అక్కడికి టికెట్ మార్చి కేటాయించే అవకాశం ఉంటుంది.
వివరాలు
వికల్ప్ అంటే ఏమిటి?
ఉదాహరణకు ఒకే గమ్యానికి వెళ్లే రైళ్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి వంటి వేర్వేరు స్టేషన్ల నుంచి నడుస్తుంటాయి. ఈ స్టేషన్ల నుంచి బయల్దేరే రైళ్లలోనూ బెర్త్ దొరికే అవకాశాలు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. రైళ్లలో బెర్త్‌లు పూర్తిగా నిండిపోయినప్పుడు ప్రయాణికులకు వెయిటింగ్ లిస్ట్ లేదా RAC స్టేటస్ వస్తుంది. ముందుగా టికెట్ తీసుకున్నవారు రద్దు చేస్తే ఆ క్రమంలో ఉన్నవారికి బెర్త్ కేటాయిస్తారు. కానీ చివరి వరకూ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపించని పరిస్థితుల్లో "వికల్ప్" ఎంతో ఉపయోగపడుతుంది. అదే మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్లలో ఖాళీ బెర్త్‌లు ఉంటే వాటిలో ప్రయాణానికి అవకాశం కల్పించడమే ఈ సదుపాయం ఉద్దేశం.
వివరాలు
కన్ఫర్మ్ టికెట్ అవకాశాలు పెరుగుతాయి
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మీరు టికెట్ బుక్ చేసుకుని వెయిటింగ్‌లో ఉన్నారనుకుందాం. బుకింగ్ సమయంలో వికల్ప్ ఎంపిక చేసుకుంటే, అదే మార్గంలో వెళ్లే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ లేదా రాజధాని వంటి ఇతర రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటే ఆటోమేటిక్‌గా మీ టికెట్ అక్కడ కన్ఫర్మ్ అవుతుంది. కేవలం సికింద్రాబాద్ నుంచే కాకుండా సమీపంలోని నాంపల్లి, చర్లపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి బయల్దేరే రైళ్లకూ మీ టికెట్ మారే అవకాశం ఉంటుంది. తత్కాల్ టికెట్‌లో కూడా వెయిటింగ్ వచ్చినప్పుడు వికల్ప్ ఉపయోగపడుతుంది. అయితే తత్కాల్ టికెట్ విషయంలో ఛార్జీల రీఫండ్ వర్తించదని గుర్తుంచుకోవాలి.
వివరాలు
ఇవి తెలుసుకోవాలి
వికల్ప్ ఆప్షన్ ఎంచుకుంటే వేరే రైలులో బెర్త్ దొరికే అవకాశం పెరుగుతుంది గానీ తప్పనిసరిగా లభిస్తుందన్న హామీ ఉండదు. ఈ సదుపాయం IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ఎంచుకున్న రైలు కాకుండా మరో రైలులో బెర్త్ కేటాయిస్తే, రద్దు ఛార్జీలు ఆ రైలు, బెర్త్ స్థితిని బట్టి నిర్ణయిస్తారు. వికల్ప్ ద్వారా ఇతర రైలులో బెర్త్ కన్ఫర్మ్ అయితే, మీరు మొదట బుక్ చేసిన రైలులోని వెయిటింగ్ లిస్ట్ నుంచి మీ పేరు ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది. వికల్ప్ ద్వారా బెర్త్ కేటాయించినప్పటికీ ప్రయాణం చేయకపోతే రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటం ప్రయాణికులకు ఉపశమనంగా ఉంటుంది.
వివరాలు
ఎనిమిది గంటల ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవకాశం
హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు సమీప రైల్వే స్టేషన్ల నుంచి రోజూ సుమారు రెండు లక్షల మంది ప్రయాణిస్తున్నారని, అందులో వికల్ప్‌ను వినియోగించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ తెలిపారు. రెండు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో పాటు వికల్ప్ ఎంపిక చేస్తే బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయని ఆయన వివరించారు. అంతేకాదు, రైలు బయల్దేరే ఎనిమిది గంటల ముందే చార్ట్ సిద్ధమవుతుండటంతో, బెర్త్ దొరకని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రయాణికులకు తగిన సమయం లభిస్తుందని తెలిపారు.