Vitamin C: 'విటమిన్ సి' ఎక్కువగా తీసుకుంటే చర్మంలో ఏమవుతుంది? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి!
ఈ వార్తాకథనం ఏంటి
చర్మంలో ఉన్న విటమిన్ సి స్థాయిలు రక్తంలో (ప్లాస్మా) ఉన్న స్థాయిలను దాదాపు ప్రతిబింబిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే, రక్తం అలాగే చర్మంలో కూడా దాని సాంద్రత పెరుగుతుందని ఈ పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాదు, ఆహార రూపంలో విటమిన్ సి తీసుకోవడం వల్ల చర్మంలోని విటమిన్ సి స్థాయిలతో పాటు చర్మం మందం కూడా పెరుగుతుందని తేలింది. న్యూజిలాండ్, జర్మనీలోని అయోటెరోవాలో 24 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులపై ఈ పరిశోధన నిర్వహించారు. వారు ప్రతిరోజూ రెండు సన్‌గోల్డ్ కివి పండ్లు తినడం ద్వారా ప్లాస్మా విటమిన్ సి స్థాయిలు గణనీయంగా పెరిగాయి.
Details
చర్మం పొర పునరుద్ధరణ
అదే సమయంలో వారి చర్మంలో కూడా విటమిన్ సి స్పష్టంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పెరుగుదల చర్మం మందం (కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుదల)తో పాటు బయటి చర్మ పొర పునరుద్ధరణకు నేరుగా సంబంధం ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన ఫలితాలను పాథాలజీ, మాలిక్యులర్ మెడిసిన్ విభాగానికి చెందిన మాటాయ్ హయోరా - సెంటర్ ఫర్ రెడాక్స్ బయాలజీ అండ్ మెడిసిన్ ప్రొఫెసర్ మార్గరీట్ విస్సర్స్ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, ఇతర అవయవాలతో పోలిస్తే రక్తంలోని విటమిన్ సి, చర్మంలోని విటమిన్ సి మధ్య ఉన్న సంబంధం ఎంతో ప్రత్యేకమైందని తెలిపారు. ప్లాస్మా విటమిన్ సి స్థాయిలు, చర్మంలోని స్థాయిల మధ్య బలమైన అనుసంధానం ఉందన్నారు.
Details
చర్మం పనితీరుకు దోహపడుతుంది
రక్తప్రవాహంలో ఉన్న విటమిన్ సి చర్మంలోని ప్రతి పొరను చేరుకుంటుందని పరిశోధనలో తేలిందన్నారు. ఇది ఆరోగ్యకరమైన చర్మ పనితీరుకు ఎంతో దోహదపడుతుందని వివరించారు. చర్మ ఆరోగ్యం అంతర్గతంగా ప్రారంభమవుతుందనే భావనకు ఈ పరిశోధన బలాన్నిచ్చిందని ప్రొఫెసర్ విస్సర్స్ పేర్కొన్నారు. పోషకాలు రక్తప్రవాహం ద్వారా సహజంగా చర్మానికి చేరి, దాని నిర్మాణం, పనితీరును మెరుగుపరుస్తాయని ఆమె అన్నారు. కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. అందుకే దీనిని చాలావరకు చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కలుపుతుంటారు. అయితే విటమిన్ సి నీటిలో త్వరగా కరిగిపోతుంది. బాహ్య చర్మ అవరోధం ద్వారా అది సరిగా గ్రహించబడదని అధ్యయనం చెబుతోంది.
Details
విటమిన్ సి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి
దీనికి భిన్నంగా, చర్మ కణాలు రక్తం నుంచి విటమిన్ సిని గ్రహించడంలో చాలా సమర్థంగా పనిచేస్తాయని, ముఖ్యంగా ఎపిడెర్మల్ పొరలోకి దీని గ్రహణం ప్రాధాన్యతగా జరుగుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. సన్‌గోల్డ్ కివిఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఈ పరిశోధన కోసం దానిని ఎంపిక చేశారు. అయితే విటమిన్ సి అధికంగా ఉండే ఇతర ఆహారాలైన సిట్రస్ పండ్లు, బెర్రీలు, క్యాప్సికమ్, బ్రోకలీ వంటి తాజా పండ్లు, కూరగాయల నుంచి కూడా ఇలాంటి ప్రయోజనాలు పొందవచ్చని పరిశోధకులు తెలిపారు. కాబట్టి ఆహారంలో విటమిన్ సి మోతాదును పెంచుకుంటే, చర్మంలోని అన్ని పొరల్లోకి అది సమర్థవంతంగా చేరుతుందని ప్రొఫెసర్ విస్సర్స్ సూచించారు.